భారతమాత ఆత్మను కాపాడుకునే పోరాటమిది

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్వరూపాన్ని నాశనం చేసేందుకు భాజపా, ఆరెస్సెస్‌ ప్రయత్నం చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

Published : 04 Apr 2024 04:07 IST

వయనాడ్‌లో రాహుల్‌ నామినేషన్‌

వయనాడ్‌, తిరువనంతపురం: భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్వరూపాన్ని నాశనం చేసేందుకు భాజపా, ఆరెస్సెస్‌ ప్రయత్నం చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తోపాటు ‘ఇండియా’ కూటమి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారతమాత ఆత్మను కాపాడుకునే పోరాటంగా లోక్‌సభ ఎన్నికలను అభివర్ణించారు. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం రాహుల్‌ నామినేషను వేశారు. తన సిట్టింగ్‌ స్థానమైన ఇక్కడి నుంచి రెండోసారి బరిలోకి దిగిన ఆయన రిటర్నింగ్‌ అధికారి అయిన వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌కు నామినేషను పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌ సోదరి ప్రియాంకాగాంధీతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కేరళకు చెందిన యూడీఎఫ్‌ నేతలు హాజరయ్యారు. ఉదయం 10.45కు హెలికాప్టర్‌లో వయనాడ్‌కు చేరుకున్న రాహుల్‌.. నామినేషను వేయడానికి ముందు కాల్‌పెట్ట నుంచి సివిల్‌ స్టేషను వరకు కాంగ్రెస్‌ శ్రేణులు, మద్దతుదారులతో భారీ రోడ్‌ షో నిర్వహించారు.  

 అన్నీ రాజా, శశిథరూర్‌ నామినేషన్లు

 వయనాడ్‌లో రాహుల్‌ ప్రత్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా సైతం బుధవారం తన నామినేషను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ మూడు పర్యాయాలు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించి, వరుసగా నాలుగోసారి పోటీకి తిరువనంతపురం నుంచి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని