3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపాలో చేరిక

పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. వైకాపా ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించి తమను నమ్మించే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.

Published : 04 Apr 2024 04:16 IST

వైకాపా మోసం చేసిందని గుర్తించామన్న బహజన పరిరక్షణ సమితి నేతలు
సమితిని తెదేపాలో విలీనం చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గుర్నాథం

ఈనాడు, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. వైకాపా ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించి తమను నమ్మించే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద దాదాపు నాలుగేళ్లుగా నిర్వహించిన మూడు రాజధానుల శిబిరాన్ని ఎత్తివేస్తున్నట్లు వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు. తెదేపాలో సమితిని విలీనం చేస్తున్నట్లుగా అధ్యక్షుడు గుర్నాథం వెల్లడించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమక్షంలో సమితి నేతలు బుధవారం తెదేపా చేరారు. వీరిలో అధ్యక్షుడు గుర్నాథంతోపాటు సంకే విశ్వనాథ్‌, యునైటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ అధ్యక్షులు అప్పికట్ల జవహర్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గుర్నాథం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ మాటలు నమ్మి మూడు రాజధానులు, పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు, ఆంగ్ల మాధ్యమం కోసం 2020 ఫిబ్రవరి నుంచి 2 నుంచి దాదాపు నాలుగేళ్లపాటు ఉద్యమం నిర్వహించి చివరకు మోసపోయాం. వికేంద్రీకరణ అంశం అస్తవ్యస్తంగా మారింది. దానిపై నమ్మకం కలిగించలేకపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు తెదేపాతోనే న్యాయం జరుగుతుందని భావించి ఆ పార్టీలో విలీనమవుతున్నాం. తెదేపా, జనసేన, భాజపా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి మద్దతు కూడగడతాం’ అని గుర్నాధం అన్నారు. ‘మూడు రాజధానుల ఉద్యమం చేసిన గురునాథం స్వచ్ఛందంగా తెదేపాలో చేరారు. అరాచక శక్తులు ఉద్యమంలో చొరబడి, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాయి. మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అదే రాష్ట్ర ప్రజల అభిప్రాయమన్నట్లు జగన్‌ నమ్మించే ప్రయత్నం చేశారు. మూడురాజధానుల కోసం ఉద్యమం చేసిన వారంతా తెదేపాలో చేరుతున్నారు’ అని విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని