వలస నేతలే ముద్దు

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లోని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీల తీరు విస్తుగొలుపుతోంది.

Updated : 04 Apr 2024 04:30 IST

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌, భాజపాలది ఒకే తీరు
ఎప్పటి నుంచో ఉన్న నేతలకు దక్కని టికెట్లు

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లోని లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీల తీరు విస్తుగొలుపుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు వలస నేతలకే ప్రాధాన్యమిస్తూ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలను పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తృణమూల్‌ నుంచి పోటీ చేస్తున్న 42 మందిలో నలుగురు ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారే.


  • తృణమూల్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పని చేస్తున్న ముగ్గురికి ఈసారి టికెట్లు దక్కాయి. అయితే వారు గతంలో వేరే పార్టీ నుంచి వచ్చినవారే.
  • భాజపా 40 మంది అభ్యర్థుల్లో ఐదుగురు వలస నేతలకు టికెట్లిచ్చింది.

తృణమూల్‌లో 26 మంది కొత్తవారే

  • 2019 ఎన్నికల్లో తృణమూల్‌ 22చోట్ల, భాజపా 18 చోట్ల, కాంగ్రెస్‌ 2 చోట్ల గెలుపొందాయి. వలసలతో ప్రస్తుతం తృణమూల్‌కు 23 మంది ఎంపీలున్నారు. వారిలో 16 మందికే మళ్లీ టికెట్లు దక్కాయి. ఏడుగురికి ఇవ్వలేదు.  
  •  తృణమూల్‌ జాబితాలో 26 కొత్త ముఖాలున్నాయి. వారిలో 11 మంది రాజకీయాలకూ కొత్తే.
  •  గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎవరికీ తృణమూల్‌ ఈసారి టికెట్‌ ఇవ్వలేదు.
  •  తృణమూల్‌ టికెట్లు దక్కించుకున్న వలస నేతల్లో బిశ్వజిత్‌ దాస్‌, ముకుత్మానీ అధికారి, కృష్ణ కల్యాణి ఉన్నారు. వారు ప్రస్తుతం భాజపా ఎమ్మెల్యేలుగా ఉండి పార్టీ మారారు.
  •  బిష్ణుపుర్‌ నుంచి తృణమూల్‌ తరఫున పోటీ చేస్తున్న సుజాత మండల్‌ మాజీ భాజపా నేత. 2021లో ఆమె తృణమూల్‌ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
  •  2022లో జరిగిన అసన్‌సోల్‌ ఉప ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా తృణమూల్‌ తరఫున గెలిచారు. అంతకుముందు ఆయన భాజపా తరఫున రెండుసార్లు ఎంపీగా పని చేశారు. కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. ఈ సారీ అసన్‌సోల్‌ నుంచే పోటీ చేస్తున్నారు.
  •  కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అయిన అబు తాహెర్‌ ఖాన్‌ ప్రస్తుతం ముర్షీదాబాద్‌ ఎంపీగా ఉన్నారు. ఆయనకు పార్టీ మళ్లీ టికెట్‌ ఇచ్చింది.

భాజపాలోనూ..

  • రెండేళ్ల కిందట తృణమూల్‌ పార్టీలోకి వెళ్లి గత నెలలో భాజపాలోకి తిరిగి వచ్చిన బారక్‌పుర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ టికెట్‌ దక్కించుకున్నారు.
  • తృణమూల్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తపస్‌ రాయ్‌ ఈసారి కోల్‌కతా నార్త్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు.
  • 2021లో భాజపాలో చేరిన తృణమూల్‌ ఎమ్మెల్యే సిల్‌భద్ర దత్తా డమ్‌డమ్‌ నుంచి లోక్‌సభ బరిలో దిగుతున్నారు.
  • తృణమూల్‌ మాజీ నేత సౌమేందు అధికారి కాంతి నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు.
  • హావ్‌డా మాజీ మేయరు రతిన్‌ చక్రవర్తి తృణమూల్‌ నుంచి భాజపాలో చేరి హావ్‌డా నుంచి పోటీ చేస్తున్నారు.

గతంలో లేవు

పశ్చిమ బెంగాల్‌లో పార్టీల నుంచి  వలసలు గతంలో ఉండేవి కావు. రాష్ట్రంలో సైద్ధాంతికపరమైన వైరుధ్యంతో నేతలు పార్టీలు మారేవారు కాదు. 1998లో తృణమూల్‌ పార్టీ రాకతో కాంగ్రెస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. 2011లో   తృణమూల్‌ అధికారంలోకి రావడంతో మరింత పెరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి భాజపా అదే బాటలో పయనిస్తోంది.

  • గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది వలస నేతలకు తృణమూల్‌ టికెట్లు ఇచ్చింది.
  • భాజపా 148 మంది వలస నేతలను బరిలోకి దింపింది. ఇందులో 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది ఓడిపోయారు.

 కోల్‌కతా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు