ఇంటింటికీ పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా?

‘‘వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్ద పింఛన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్‌కల్యాణ్‌ సినిమా విడుదలైతే రెవెన్యూ సిబ్బందికి సినిమా థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు.

Published : 04 Apr 2024 06:27 IST

గతంలో థియేటర్ల వద్ద  డ్యూటీలు వేశారు కదా!
సీఎస్‌ను ఎక్స్‌లో ప్రశ్నించిన  పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘‘వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్ద పింఛన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్‌కల్యాణ్‌ సినిమా విడుదలైతే రెవెన్యూ సిబ్బందికి సినిమా థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు. తహసీల్దార్ల ఫోను నంబర్లు ఇస్తారు. కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీ వేసిన ఘనత ప్రభుత్వానికి ఉంది. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం ఎక్స్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం సాయంతో పింఛన్లు ఇళ్ల వద్ద ఇవ్వడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్భంగా 2022 ఫిబ్రవరి 24న ప్రభుత్వంఇచ్చిన జీవోను ట్వీట్‌కు జత చేశారు.

కూటమి నాయకులు తోడుగా ఉండాలి

పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు జనసేన నాయకులు, కార్యకర్తలు తోడుగా ఉండాలని పవన్‌ సూచించారు. లబ్ధిదారులను కార్యాలయాలకు సొంత వాహనాలపై తీసుకువెళ్లి పింఛను ఇప్పించి ఆ తర్వాత ఇంటి దగ్గర దించి రావాలని పిలుపునిచ్చారు. తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.


పవన్‌కు తీవ్ర జ్వరం.. ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో బుధవారం తెనాలిలో నిర్వహించాల్సిన వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు గురువారం నుంచి జరగాల్సిన ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా పడింది. రీ-షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని పార్టీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఆరోగ్యం కుదుటపడగానే తెనాలి వచ్చి వారాహి సభలో పాల్గొంటా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో బుధవారం పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని