జగన్‌ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి?

‘నా పెద్దన్న రాజశేఖరరెడ్డి తనయుడు, నా చిట్టి తమ్ముడని జగన్‌ను నమ్మి వైకాపాలో చేరా. కానీ కేంద్ర మాజీ మంత్రిని, అయిదున్నరేళ్లపాటు కార్యకర్త కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేసిన నన్ను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు.

Published : 04 Apr 2024 06:27 IST

శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకిచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదు
కృపమ్మా.. నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉందన్నారు
కేబినెట్‌ హోదాలో దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని చేస్తామన్నారు
2019 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చెయ్యమన్నారు.. చివర్లో ఆపారు
5 నిమిషాల కోసం 3 నెలలుగా నిరీక్షించినా జగన్‌ నుంచి పిలుపులేదు
విలపించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
అవమానభారంతో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే- శ్రీకాకుళం నేరవార్తావిభాగం, టెక్కలి: ‘నా పెద్దన్న రాజశేఖరరెడ్డి తనయుడు, నా చిట్టి తమ్ముడని జగన్‌ను నమ్మి వైకాపాలో చేరా. కానీ కేంద్ర మాజీ మంత్రిని, అయిదున్నరేళ్లపాటు కార్యకర్త కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేసిన నన్ను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా ఎందుకు అవమానించారు? అవినీతికి పాల్పడ్డానా? ఒకరిని దూషించానా? జగన్‌ ఒక్క కారణాన్ని చూపగలరా’ అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కన్నీటితో ప్రశ్నించారు. ‘అన్యాయాన్ని భరిస్తాను కానీ అవమానాలను భరించలేను. వైకాపా రాజ్యాంగం ప్రకారం పార్టీకి విద్యావంతులు, అవినీతికి పాల్పడనివారు, సంస్కారవంతులు అక్కర్లేదు. బూతులు తిట్టేవారు, వెన్నుపోటు పొడిచేవారైతేనే ఆ పార్టీలో ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకోకుండా ఆ పార్టీలో చేరా. అందువల్లే నేను అనర్హురాలినయ్యానేమో? ఆ కారణంగానే జగన్‌ ఇలా అవమానించారా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సంస్కారవంతురాలిని, విద్యావంతురాలిని కాబట్టే అవమానించారా? కృపమ్మా..అక్కా.. నీకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. మీ దంపతులు ఇద్దరూ నా హృదయానికి దగ్గరగా ఉంటారని నమ్మించి.. ఇప్పుడు జగన్‌ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి?’ అని నిలదీశారు. ఈ అవమానాల కారణంగానే వైకాపాకు రాజీనామా చేస్తున్నానంటూ బుధవారం ఆమె శ్రీకాకుళంలో విలేకర్ల ముందు ప్రకటించారు.

జగన్‌ మానవతావాది అయితే పిలిచేవారేమో!

‘నాకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలని కొన్ని విషయాలను చెబుతూ ఒక లేఖను మూడు నెలల కిందట అసెంబ్లీలో సీఎం జగన్‌ను కలిసి అందజేశా. జగన్‌ మానవతావాది అయితే ఆ లేఖ చదివాక నన్ను పిలిచి మాట్లాడేవారు. కానీ పిలవలేదు. ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వాలని లేఖలో కోరాను. సీఎం పిలుపు కోసం 3 నెలలుగా వేచిచూశా. అవమానాలు భరించి పార్టీలో ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉండాలని వైకాపాకు రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. కేంద్ర మంత్రిగా పనిచేశాననే చిప్‌ను నీ బుర్రలో నుంచి తీసేయమ్మా.. అప్పుడే నువ్వు కార్యకర్తలతో కలిసి పనిచేయగలవని జగన్‌ చెబితే అదే నిమిషం నేను ఆ చిప్‌ను లోటస్‌పాండ్‌లోనే తీసి పారేశాను. నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఏఐసీసీ వద్దని వారించినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రోశయ్య అడ్డు చెప్పినా నా భర్త రామ్మోహన్‌రావు జగన్‌ ఓదార్పు యాత్రకు అండగా నిలబడ్డారు. నేను వైకాపాలో చేరినప్పుడు కేబినెట్‌ హోదాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దిల్లీలో పదవినిస్తామన్నారు. తర్వాత 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమన్నారు. చివరికి జాబితాలో నా పేరు లేదు.     3 ఆప్షన్లు ఉన్నాయి, నీకు తగిన గౌరవం ఇస్తా, రాష్ట్ర  రాజకీయాల్లో నా కళ్ల ముందుండు అని జగన్‌ చెబితే నా తమ్ముడు నాకు గౌరవం ఇస్తాడని పూర్తిగా నమ్మాను. ఆయన హామీలు ఏమయ్యాయి? నా అన్న రాజశేఖరరెడ్డి కుమారుడి పార్టీ, నా పుట్టిల్లు అనుకుని వెళ్లిన పార్టీలో నీకు స్థానం లేదు అని అవమానించడాన్ని భరించలేకపోయా’ అని కృపారాణి కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని