మోదీవి విఫల హామీలు

‘మోదీ కీ గ్యారంటీ’ పేరుతో ప్రధాని మోదీ ఇస్తున్న హామీలు విఫలమయ్యాయని, అవి ప్రజల్ని చేరలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

Updated : 04 Apr 2024 06:43 IST

‘ఘర్‌ ఘర్‌ గ్యారంటీ’ ప్రారంభోత్సవంలో ఖర్గే

దిల్లీ: ‘మోదీ కీ గ్యారంటీ’ పేరుతో ప్రధాని మోదీ ఇస్తున్న హామీలు విఫలమయ్యాయని, అవి ప్రజల్ని చేరలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్‌ తరఫున ‘ఘర్‌ ఘర్‌ గ్యారంటీ’ (ఇంటింటికీ హామీ) కార్యక్రమాన్ని బుధవారం ఈశాన్య దిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలోని ఉస్మాన్‌పుర్‌లో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘‘..ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబానికి ‘పాంచ్‌ న్యాయ్‌- పచీస్‌ గ్యారంటీ’ కరపత్రాలను పంపిణీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కుటుంబాలకు చేరేలా 14 వేర్వేరు భాషల్లో హామీల కరపత్రాలను సిద్ధం చేశాం. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చాక ఏమేం చేస్తుందో వీటిద్వారా ప్రజలకు వివరిస్తాం. మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోసం పని చేసిందని, అలాగే చేస్తుందని మేం హామీ ఇస్తున్నాం’’ అని ఖర్గే వివరించారు.

ప్రతిఒక్కరి భవితకు హామీ: రాహుల్‌

ఐదు న్యాయాలపై తాము చేస్తున్న వాగ్దానంతో దేశంలో ప్రతిఒక్కరి భవితకు హామీ లభిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్తు, సమానావకాశాలు, దేశాభివృద్ధిలో సముచిత వాటా అందరికీ కల్పిస్తామని చెప్పారు. పార్టీ హామీ కార్డును ఒక మహిళకు తాను ఇస్తున్న ఛాయాచిత్రాన్ని దీనికి జతచేశారు. ‘‘విద్యావంతులైన యువతలో అందరికీ తొలి ఉద్యోగం రూ.లక్ష జీతంతో లభిస్తుంది. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తాం. రైతులకు రుణమాఫీ చేసి.. చట్టబద్ధతతో కనీస మద్దతు ధర కల్పిస్తాం. ఉపాధి హామీ కూలీలు సహా శ్రామికులకు రోజుకు కనీసం రూ.400 ఇస్తాం. సామాజిక, ఆర్థిక సమానత్వానికి కులగణన చేస్తాం’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని