భారాస నిజానికి.. కాంగ్రెస్‌ అబద్ధాలకు సమరం

లోక్‌సభ ఎన్నికలు పదేళ్ల భారాస నిజానికి- వంద రోజుల కాంగ్రెస్‌ అబద్ధానికి మధ్య జరుగుతున్న సమరమని, వంద రోజుల కాంగ్రెస్‌ పాలన ప్రజలను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 04 Apr 2024 04:20 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు పదేళ్ల భారాస నిజానికి- వంద రోజుల కాంగ్రెస్‌ అబద్ధానికి మధ్య జరుగుతున్న సమరమని, వంద రోజుల కాంగ్రెస్‌ పాలన ప్రజలను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లో నిర్వహించిన వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. రుణాలు తీసుకోని వారుంటే వెంటనే వెళ్లి తీసుకోవాలన్నారు. రైతు భరోసా సాయం రూ.15 వేలకు పెంచుతామన్నారు. పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామనీ ప్రకటించారు. ఈ హామీలు ఏమయ్యాయి? ఓవైపు రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతోంటే, మరోవైపు బ్యాంకు అధికారులు బలవంతంగా రుణ వసూళ్లకు పాల్పడుతున్నారు. పంట చేతికొచ్చే తరుణంలో సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేసి అన్నదాతలను కష్టాలపాలు చేశారు’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ చేశారు. భారాస వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ వాణీదేవి, మహేశ్వరం, చేవెళ్ల ఎమ్మెల్యేలు సబితారెడ్డి, యాదయ్య, మహేశ్‌రెడ్డి, భారాస చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, నాయకులు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని