6 గ్యారంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. మహిళలకు రూ.2500.. నిరుద్యోగులకు రూ.4వేల భృతి.. రైతుల ఖాతాల్లో రూ.15వేల రైతుబంధు.. ఆసరా పింఛన్లు రూ.4వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ వీటిలో ఒక్కటైనా అమలు చేయలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు.

Published : 04 Apr 2024 04:22 IST

మంత్రులకు హరీశ్‌రావు సవాల్‌

భువనగిరి, భువనగిరి గంజ్‌, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. మహిళలకు రూ.2500.. నిరుద్యోగులకు రూ.4వేల భృతి.. రైతుల ఖాతాల్లో రూ.15వేల రైతుబంధు.. ఆసరా పింఛన్లు రూ.4వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ వీటిలో ఒక్కటైనా అమలు చేయలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయని కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజలు నిలదీయాలన్నారు. మోసం కాంగ్రెస్‌ నైజమని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భారాస భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం భువనగిరిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ మంత్రులు దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. తిరిగి కాంగ్రెస్‌కు ఓటేస్తే .. ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారని ప్రచారం చేస్తారని, అసెంబ్లీలో తమకు ప్రశ్నించే అవకాశం ఉండదని చెప్పారు.

వారికి మూడోస్థానమే..

కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో రాహుల్‌గాంధీ సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఆయల్ని గెలిపిస్తే మరిన్ని మోసాలు చేస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు దొరక్క మోసగాళ్లు, ఇతర పార్టీల వారిని చేర్చుకుని టికెట్లు ఇస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్‌, కడియం కావ్య, రంజిత్‌రెడ్డి, పట్నం సునీతా మహేందర్‌రెడ్డిలను ప్రజలు హర్షించడం లేదని, వారు మూడో స్థానానికి పరిమితమవడం ఖాయమన్నారు. ప్రశ్నించే గొంతుకలను భారాస తరఫున పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న బీసీ వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ను భువనగిరి నుంచి భారాస అభ్యర్థిగా గెలిపించాలన్నారు. పార్టీ శ్రేణులకు తాము అండగా ఉంటామని.. అక్రమ కేసులపై ప్రత్యేక లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయసాయం చేస్తామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఒక్క మెడికల్‌ కళాశాల ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన భాజపాకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

భారాసపై కేసు నమోదు

భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్‌హాల్‌లో సుమారు వెయ్యిమందితో భారాస నిర్వహించిన సమావేశానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 341, 188 సెక్షన్‌ కింద భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో భారాసపై, సమావేశ నిర్వాహకులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని