అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా

నాగర్‌కర్నూల్‌ ఎంపీలుగా కొనసాగిన వారు పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేదని.. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ వాణి వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 04 Apr 2024 04:34 IST

నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ ఎంపీలుగా కొనసాగిన వారు పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేదని.. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ వాణి వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం వనపర్తి మండలం రాజపేట శివారులోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల నిజాలకు.. వందరోజుల అబద్ధాలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వృత్తిలో నిబద్ధతతో పనిచేసి సకల సౌకర్యాలను వదులుకుని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. బహుజన, సామాజిక వాదం ఒకటేనని నమ్మి మాజీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో భారాసలో చేరినట్లు పేర్కొన్నారు. ఎంపీ రాములు తన ఐదేళ్ల పదవీకాలంలో ఆరు ప్రశ్నలడిగారని, ఆయన కుమారుడు భరత్‌ప్రసాద్‌ 600 ప్రశ్నలు అడుగుతారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి గతంలో దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉండి తెలంగాణ వాదం వినిపించలేదని పేర్కొన్నారు. సమావేశంలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ రజని, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని