భాజపాతో తెలంగాణకు ప్రమాదం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 04 Apr 2024 04:35 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు 2024 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వల్ల తెలంగాణకు ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో పాలన సరిగా సాగనివ్వకుండా.. నిధులు రాకుండా ఆటంకం కలిగిస్తోంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను నిలిపివేసి ప్రచారానికి ఆటంకం కలిగిస్తోంది’’ అని ఆరోపించారు. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణలో భారాస శూన్యమవడం ఖాయమని, ఆ పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. భారాస నేతలు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ 24 గంటల కరెంటు, మంచినీరు అందిస్తున్నామన్నారు. తుక్కుగూడలో 6న జరిగే ఎన్నికల ప్రచార సభ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని