కనీవినీ ఎరుగని రీతిలో సభ

తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ విధంగా పట్టం కట్టారో, దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Published : 04 Apr 2024 04:36 IST

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా

మహేశ్వరం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ విధంగా పట్టం కట్టారో, దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లు సాధిస్తుందని, రాహుల్‌గాంధీ జూన్‌ 6న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌధరిలతో కలిసి ఆయన పరిశీలించారు. వీరి వెంట నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న తుక్కుగూడ సభలోనే పార్టీ జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని, రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు లక్షల మంది సభకు తరలివస్తారని తెలిపారు. భారాస ప్రభుత్వ హయాంలో కొందరు అరాచకాలు, అక్రమాలు, దోపిడీలతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టారని, భూ దందాలు, ధరణి చాటున పేదవారి భూములను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. చివరికి గొర్రెల డబ్బులనూ దోచుకున్నారని ఆక్షేపించారు. అలాంటి వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుచేసి చూపుతామన్నారు.

ట్యాపింగ్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

గత ఎన్నికల సమయంలో భారాస నేతలు తమ ఫోన్లు ట్యాప్‌ చేసి  రాజకీయ లబ్ధి పొందారని మంత్రి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ఈ అంశంపై కేటీఆర్‌ బుధవారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘ఎవరి తాట ఎవరు తీస్తారో మున్ముందు తెలుస్తుంది’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. టెలిగ్రాఫ్‌ చట్టం కింద ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై విచారణ చేయడానికి కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నాయని, ఎప్పుడైనా సుమోటోగా కేసు నమోదు చేసుకోవచ్చన్నారు. కేంద్రంలోని భాజపా సర్కారు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో భారాసకి సహకరించేలా భాజపా వ్యవహారశైలి ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ కొనసాగిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని