కేసీఆర్‌ హయాంలో ప్రతి రైతుకూ నష్టం

మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలోని ప్రతి రైతుకూ నష్టం జరిగిందని, తరి పేరిట ఐదారు కిలోల ధాన్యం తరుగు తీసి మోసగించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.

Published : 04 Apr 2024 04:37 IST

ప్రకృతి వైపరీత్యాలను కాంగ్రెస్‌కు అంటగట్టే యత్నం
భారాస నేతలపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలోని ప్రతి రైతుకూ నష్టం జరిగిందని, తరి పేరిట ఐదారు కిలోల ధాన్యం తరుగు తీసి మోసగించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. తాము గింజ తరుగు తీయకుండానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ తెచ్చిన కరవు అంటూ భారాస నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. బుధవారం హైదరాబాద్‌లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఆ పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌, విజయరమణారావు, ప్రేమ్‌సాగర్‌రావు, మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి శ్రీధర్‌బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతేడాది వర్షాకాలంలో భారాస ప్రభుత్వమే ఉందని, కాంగ్రెస్‌ సర్కారు డిసెంబరులో ఏర్పాటైందని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. ఆలోచన లేకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. భారాస పదేళ్ల పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథకు ప్రణాళిక లేకుండా రూ.45 వేల కోట్లు చేశారని, అందుకే వర్షాభావ పరిస్థితులో తాగునీటి సమస్య తలెత్తిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలవే కాకుండా, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేసిందని, అందుకు కారణమైన వారంతా బయటకు వస్తారన్నారు. దిల్లీకి కాంగ్రెస్‌ సర్కారు కప్పం కడుతోందన్న విమర్శలపైనా మంత్రి స్పందించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు దిల్లీకి కప్పం కట్టారా అని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని