పింఛను పంపిణీలో కుట్రలు

‘జే’ బ్రాండ్‌ మద్యం విక్రయాల కోసం దుకాణాల దగ్గర ఉపాధ్యాయులు, వీఆర్వోలను నిలబెట్టిన సీఎం జగన్‌.. వారి ద్వారా పింఛను పంపిణీ ఎందుకు చేయించడం లేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 04 Apr 2024 05:17 IST

తెదేపా నేతల మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘జే’ బ్రాండ్‌ మద్యం విక్రయాల కోసం దుకాణాల దగ్గర ఉపాధ్యాయులు, వీఆర్వోలను నిలబెట్టిన సీఎం జగన్‌.. వారి ద్వారా పింఛను పంపిణీ ఎందుకు చేయించడం లేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. కోడికత్తి, వివేకా హత్యకేసు లాంటి ఎన్నో విషయాల్లో నీతిమాలిన రాజకీయాలు చేసిన జగన్‌.. ఇప్పుడు పింఛను పంపిణీ విషయంలో అధికారుల్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ యంత్రాంగం తప్పుడు విధానాల వల్ల లక్షల మంది పింఛనుదార్లు పింఛను కోసం రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు. పింఛను పంపిణీని అధికారులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని తెదేపా నేతలు ఆక్షేపించారు.


వృద్ధులను ఎండలో నిలబెట్టడం దుర్మార్గం
-తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు

సచివాలయాల్లో కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా.. వృద్ధులను పింఛను కోసం మండుటెండలో నిలబెట్టడం దారుణం. వైకాపాకు లబ్ధి చేకూర్చడానికే సీఎస్‌ జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి, సీఎం పేషీ ధనుంజయరెడ్డి ఇలాంటి ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా కొంతమంది ఉన్నతాధికారులు ఇంకా జగన్‌ చెప్పినట్లు ఆడుతున్నారు. పింఛను పంపిణీకి యంత్రాంగం లేదని చెబుతున్న ప్రభుత్వం.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న 14,232 మంది సిబ్బందిని కూడా వినియోగించుకోవచ్చు.


ఖజానా ఖాళీ చేసి.. నెపం తెదేపాపై
- దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ, తెదేపా

ఒకటో తేదీన అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పింఛను సొమ్మును మార్చి 16-30 మధ్య అస్మదీయ గుత్తేదారులకు పంచిపెట్టేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఆ నెపాన్ని తెదేపాపైకి నెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని