YSRCP: ప్లకార్డులు పట్టించి.. బలవంతపు నినాదాలు చేయించి..!

సచివాలయాల వద్దకు వచ్చిన పింఛనుదారులపై వైకాపా కన్వీనర్లు ఒత్తిడి తెచ్చి మరీ ప్రభుత్వ అనుకూల, ప్రతిపక్ష వ్యతిరేక నినాదాలు చేయించారు.

Updated : 04 Apr 2024 09:19 IST

పింఛనుదారులతో వైకాపా నేతల పైశాచికానందం

అమరావతి, ఈనాడు; విశాఖపట్నం (గోపాలపట్నం), ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సచివాలయాల వద్దకు వచ్చిన పింఛనుదారులపై వైకాపా కన్వీనర్లు ఒత్తిడి తెచ్చి మరీ ప్రభుత్వ అనుకూల, ప్రతిపక్ష వ్యతిరేక నినాదాలు చేయించారు. విశాఖ 92వ వార్డు నరసింహనగర్‌ సచివాలయం (477) వద్ద పింఛను సొమ్ము తీసుకునేందుకు వచ్చిన వారిపై వార్డు వైకాపా కన్వీనర్లు ఒత్తిడి చేసి ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక నినాదాలు చేయించారు. ఉదయం వచ్చిన వారిని మధ్యాహ్నం వరకు ఓ గదిలో ఉంచి అసహనానికి గురి చేశారు. ఆ తర్వాత దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను ఎండలో నిలబెట్టి.. ప్లకార్డులు ఇచ్చి బలవంతంగా ప్రతిపక్షాలను విమర్శించేలా ఒత్తిడి తెచ్చారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు వచ్చి పింఛనుదారుల చేతిలో ఉన్న ప్లకార్డులను స్వాధీనం చేసుకుని వైకాపా కన్వీనర్లను అక్కడినుంచి పంపించారు. పాతగోపాలపట్నం, బాజీ కూడలి, బాపూజీనగర్‌, లక్ష్మీనగర్‌, ఇందిరానగర్‌ సచివాలయాల వద్ద కూడా వైకాపా నాయకుల ఆధ్వర్యంలో పింఛనుదారులతో బలవంతంగా నిరసన కార్యక్రమాలు చేయించారు. కర్నూలు జిల్లా హాలహర్వి ప్రధాన సచివాలయాల వద్ద వైకాపా నాయకులు కొందరు చేశారు. కావాలని రెట్టిస్తూ ‘వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా? ఇక్కడికి వచ్చి తీసుకోవడం మంచిదా?’ అని వృద్ధులను ప్రశ్నలతో వేధించారు.

ఈ అవస్థలు పెట్టిందెవరు?

గుంటూరు జిల్లా మంగళగిరిలోని 7, 9 సచివాలయాలకు నడవలేని వాళ్లు, దివ్యాంగులు నానా అగచాట్లు పడుతూ వచ్చారు. వీరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నా.. వాలంటీరు ఇంటి వద్ద ఇవ్వరని చెప్పి లబ్ధిదారులను సచివాలయానికి పంపారు. నడవలేని స్థితిలో ఉన్న సామ్రాజ్యం, కాళ్లు చచ్చుబడి సీతామహాలక్ష్మి వాకర్‌ సాయంతో సచివాలయానికి వచ్చారు. అంత కష్టపడి వస్తే.. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకురావాల్సి ఉందని, గురువారం పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.


‘సాక్షి’ టీవీ ప్రతినిధులు సైతం

ఏలూరు వన్‌టౌన్‌: ఏలూరు గన్‌బజారులోని నూకాలమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న వార్డు సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి వచ్చిన వృద్ధులకు.. తెదేపా ఫిర్యాదు వల్లే పంపిణీ ఆలస్యమైందని సాక్షి టీవీ సిబ్బంది చెబుతుండగా అక్కడ ఉన్న తెదేపా నాయకులు అడ్డుకున్నారు. ప్రజలు, పింఛనుదారులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని నిలదీశారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని