ఏపీ అభివృద్ధికే తెదేపా, జనసేనలతో కూటమిగా ఏర్పడ్డాం

‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే భాజపా, తెదేపా, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని పిలుపునిస్తున్నా’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

Updated : 04 Apr 2024 07:36 IST

కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌

ఈనాడు, దిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే భాజపా, తెదేపా, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని పిలుపునిస్తున్నా’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం దిల్లీలోని తన నివాసంలో ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తం సాయం చేస్తామని ఇదివరకే చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌ను ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. దేశంలో మూడు రాష్ట్రాలకు బల్క్‌డ్రగ్‌ పార్కులు కేటాయిస్తే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాం. నాలుగింటిలో ఒక మెడికల్‌ డివైజ్‌ పార్క్‌నూ ఇచ్చాం. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలన్నీ మంజూరు చేసి నిర్మించాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన డబ్బులన్నీ ఇచ్చాం. వై.ఎస్‌.షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. భాజపాలోకి చేరాలని ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదు’’ అని అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు..

‘మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సమయం నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు చంద్రబాబునాయుడుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కూటమి రెండుసార్లు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాతో పొత్తు లేకపోతే కూటమి అసంపూర్తిగా ఉంటుందని, కలిసి పోటీ చేస్తే మరింత శక్తిమంతంగా తయారవుతుందని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ భావించి ఉండొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన మౌలిక వసతులు కల్పించలేదు. పరిశ్రమలూ తీసుకురాలేదు. గుజరాత్‌ తర్వాత సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వైకాపా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. రూ.వేల కోట్ల అప్పులు చేసి ఏపీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తోసింది. అప్పులకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయలేరు. కొవిడ్‌ సమయంలో అన్ని రాష్ట్రాలకూ అప్పుల పరిధిని 3% నుంచి 3.5%కి పెంచాం. వివిధ షరతులకు లోబడి అదనపు రుణాలు తీసుకోవడానికీ అన్ని రాష్ట్రాలకూ కేంద్రం అవకాశం ఇచ్చింది. సంస్కరణల ఆధారంగా ప్రోత్సాహకాలు అందించింది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించలేదు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని