శవంతో జోగి రాజకీయం.. మృతదేహంతో రాజకీయాలొద్దంటూ బంధువుల ఆగ్రహం

సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పింఛనుదారైన ఓ వృద్ధురాలు మరణించగా, ఆ నెపాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు మీదకు నెట్టేయాలని చూసిన వైకాపా నేత జోగి రమేశ్‌ స్థానికులు ఎదురు తిరగడంతో వెనక్కు తగ్గారు.

Updated : 04 Apr 2024 07:30 IST

ఈనాడు, అమరావతి - కంకిపాడు గ్రామీణం, పెనమలూరు, న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పింఛనుదారైన ఓ వృద్ధురాలు మరణించగా, ఆ నెపాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు మీదకు నెట్టేయాలని చూసిన వైకాపా నేత జోగి రమేశ్‌ స్థానికులు ఎదురు తిరగడంతో వెనక్కు తగ్గారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వెంపటి వజ్రమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. అలాంటివారికి ఇంటికే పింఛను తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ ఆమె ఉదయం 9 గంటలకు సచివాలయానికి వచ్చినా సిబ్బంది పట్టించుకోలేదు. చాలాసేపు వేచి ఉన్నాక మధ్యాహ్నం రమ్మన్నారు. దీంతో ఇంటికొచ్చి, మళ్లీ మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో సచివాలయానికి వెళ్లింది. అప్పటికీ ఇంకా డబ్బులు రాలేదంటూ పంపిణీని ప్రారంభించలేదు. చాలాసేపు ఎండలో వేచి ఉన్నా ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చేసింది. అప్పటికే వడదెబ్బ తగడలడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లి కొద్దిసేపటికి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్‌ ఓ పూల దండ ఒకటి పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. ప్రతిపక్షాల కుట్ర వల్లే వృద్ధురాలు మృతి చెందిందంటూ హడావుడి మొదలుపెట్టారు. మృతదేహాన్ని తీసుకుని.. చంద్రబాబు ఇంటివైపు వెళ్లడానికి సిద్ధపడ్డారు. ప్రతిపక్ష పార్టీలపై బురదజల్లేలా నినాదాలు మొదలెట్టారు. ఈ హంగామాను స్థానికులు, వజ్రమ్మ బంధువులు అడ్డుకున్నారు. మనిషి చనిపోయిన బాధలో తాము ఉంటే ఇలా ఓట్ల కోసం రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ నిలదీశారు. మృతదేహంతో నీచ రాజకీయాలు వద్దంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలో అక్కడకు చేరుకున్న తెదేపా పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్‌, ఆయన అనుచరులు ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వృద్ధురాలు చనిపోయిందంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు