‘వివేకా హత్యపై విజయమ్మ వాస్తవాలు చెప్పాలి’

తన కుమారుడు జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అందలం ఎక్కే అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్‌ విజయమ్మ.. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో నెలకొన్న గందరగోళంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు.

Updated : 04 Apr 2024 09:27 IST

లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌

విజయనగరం, ఈనాడు: తన కుమారుడు జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అందలం ఎక్కే అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్‌ విజయమ్మ.. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో నెలకొన్న గందరగోళంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు. విజయనగరంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా అధినేత జగన్‌ ఆ పార్టీ అభ్యర్థులను వైఎస్‌ సమాధి వద్ద ప్రకటించిన సమయంలో, పీసీసీ అధ్యక్షురాలిగా కుమార్తె షర్మిల కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు కూడా విజయమ్మ వారి పక్కనే ఉంటూ మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్య విషయంలో జగన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని సునీత, షర్మిలలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చకు సిద్ధమా.. అని వారిద్దరూ సవాల్‌ విసురుతుంటే విజయమ్మ ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ పునాదులు రక్తంలో మునిగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నా.. వైకాపా నుంచి సమాధానం కరవైందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్‌రెడ్డికి జగన్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడాన్ని సైతం ఇద్దరు చెల్లెళ్లూ బహిరంగంగా తప్పు పడుతున్నారన్నారు. ఈ గందరగోళ పరిస్థితులు తొలగిపోవాలంటే విజయమ్మ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, జలంత్రి రామచంద్రరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని