బెంగాల్‌లో ‘జూట్‌’ తంత్రం

పశ్చిమ బెంగాల్‌లో జూట్‌ పరిశ్రమకు ఎనలేని ప్రాధాన్యముంది. ఇక్కడి పరిశ్రమల్లో 2.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.

Updated : 06 Apr 2024 06:36 IST

కార్మికులు, రైతులను ఆకట్టుకునేందుకు తృణమూల్‌, భాజపా యత్నం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జూట్‌ పరిశ్రమకు ఎనలేని ప్రాధాన్యముంది. ఇక్కడి పరిశ్రమల్లో 2.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ముడి సరకు ఉత్పత్తిపై 40లక్షల మంది రైతులు ఆధారపడ్డారు. హుగ్లీ, ఉత్తర 24 పరగణాలు, హావ్‌డా జిల్లాల్లోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. జూట్‌ కార్మికులు, రైతులను ఆకట్టుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే మొగ్గు తృణమూల్‌వైపే ఉన్నట్లు తెలుస్తోంది. తాము మమతకే మద్దతు తెలుపుతామని కార్మికుల్లో ఎక్కువ మంది చెబుతున్నారు. 2019లో జూట్‌ మిల్లులున్న ప్రాంతాలైన బౌరక్‌పుర్‌, హుగ్లీల్లో భాజపా గెలిచింది. జూట్‌ సాగు చేసే ప్రాంతాల్లో తృణమూల్‌ ఆధిక్యం సాధించింది.


సమస్యలు

  • ప్రస్తుతం జూట్‌ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. దేశవ్యాప్త డిమాండ్‌ అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తిని అవి ఇప్పటికే 10శాతం నుంచి 15శాతం తగ్గించాయి. ఇది 20శాతం నుంచి 25శాతానికీ తగ్గనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమలు వారంలో నాలుగైదు రోజులే పని చేస్తున్నాయి.
  • రబీ సీజనులో 3.5లక్షల బేళ్ల జూట్‌ బ్యాగుల సేకరణను ప్రభుత్వం తగ్గించింది.
  •  ప్రభుత్వం నుంచి డిమాండ్‌ తగ్గిపోవడంతో కొన్ని జూట్‌ మిల్లులు మూతపడుతున్నాయి. హుగ్లీలోని శ్యాంనుగ్గుర్‌ జూట్‌ ఫ్యాక్టరీ ఇటీవలే పనులను ఆపేసింది. వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
  • ఉపాధి కోల్పోయిన కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. మళ్లీ వ్యవసాయం బాట పడుతున్నారు.

భాజపా

  • జూట్‌ ముడి సరకుకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెంచింది. దీంతోపాటు జూట్‌ పరిశ్రమ నుంచి నిరసనల నేపథ్యంలో ఆహార పదార్థాలకు 100శాతం జూట్‌ బ్యాగులను వాడాలన్న నిబంధనను సరళీకరిస్తామన్న ప్రతిపాదన నుంచి వెనక్కితగ్గింది.
  • సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఐదేళ్ల పునరుద్ధరణ రోడ్డు మ్యాప్‌ను రూపొందించింది. అయితే ఇప్పటికే మిల్లుల్లో సంక్షోభం, కార్మికుల ఉద్వాసనతో భాజపాకు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి.
  • అయితే బౌరక్‌పుర్‌ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ మాత్రం మిల్లుల యజమానులదే తప్పని అంటున్నారు. వారు స్థానికంగా కాకుండా బంగ్లాదేశ్‌ నుంచి ముడి సరకును తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో గెలిచిన ఆయన తృణమూల్‌లోకి వెళ్లారు. మళ్లీ నెల కిందట భాజపాలోకి వచ్చి పోటీ చేస్తున్నారు.
  • చాలా మంది జూట్‌ మిల్లుల కార్మికులు భాజపాకే మద్దతిస్తున్నారని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ నేత బినోద్‌ సింగ్‌ తెలిపారు. తమ సమస్యలను ఎన్డీయే ప్రభుత్వమే పరిష్కరిస్తుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. కేంద్రం 5.58లక్షల బేళ్ల జూట్‌ సంచులకు ఆర్డర్‌ ఇచ్చిందని, మిల్లులు కావాలనే ఉత్పత్తిని తగ్గించి 4.85 లక్షల బేళ్లనే ఇస్తామని అంటున్నాయని ఆరోపించారు.

తృణమూల్‌

  • బెంగాల్‌ ప్రభుత్వం గత జనవరిలో జూట్‌ మిల్లుల్లో వేతన సవరణను పూర్తి చేసింది. వారి వేతనాలు 30శాతం వరకూ పెరిగాయి.
  • జూట్‌ ఉత్పత్తి చేసే రైతులకు పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు