అసలు పోరు ఆ దిగ్గజాల మధ్యే!

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి.

Published : 08 Apr 2024 06:20 IST

కన్నడనాట రాజకీయ కోలాటం

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక రాజకీయాల్లో కొందరు వృద్ధ నేతలకు దాదాపు చివరి సమరానికి తీపి, చేదు గుర్తులుగా మారనున్నాయి. భాజపా, కాంగ్రెస్‌, జనతాదళ్‌కు చెందిన నలుగురు సీనియర్‌ నేతలు వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి వయసు రీత్యా కీలక పాత్ర పోషించే అవకాశాలు దాదాపు లేవు. వీరిలో కొందరు మరో ఐదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని ప్రకటించగా, కొందరు ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీనియర్లు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయా పార్టీల ఎన్నికల వ్యూహాలకు వీరే రూపకర్తలు. పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధివిధానాలన్నీ వీరి కనసన్నల్లోనే రూపుదాల్చుతున్నాయి. జూన్‌ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలకు వీరే బాధ్యులు కానున్నారు.

ఈనాడు, బెంగళూరు


పొత్తుల పెద్దన్న

సరిగ్గా ఏడాది కిందట నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ (జనతాదళ్‌-సెక్యులర్‌) కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కనీసం 25 స్థానాలైనా గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌ కావాలని ఆశించిన దళ్‌కు నిరాశే మిగిలింది. ఈ ఫలితాల తర్వాత ఏకైక ప్రాంతీయ పార్టీ పని అయిపోయిందనే అందరూ భావించారు. కానీ ఏడాది తర్వాత నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ జేడీఎస్‌ కార్యాలయం కళకళలాడుతోందంటే అందుకు కారణం ఆ పార్టీ అధినేత హెచ్‌.డి.దేవేగౌడ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పతనావస్థలో ఉన్న పార్టీని నిలబెట్టేందుకు జాతీయ పార్టీతో పొత్తు అనివార్యమని భావించి తానే స్వయంగా రంగంలో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలతో నేరుగా మంతనాలు జరిపారు. అందులో భాగంగా బెంగళూరు నుంచి దిల్లీలోని భాజపా కార్యాలయానికి దేవేగౌడ వేసిన మైత్రి మార్గంలో కుమారుడు కుమారస్వామి, మనవళ్లు నిఖిల్‌ గౌడ స్వేచ్ఛగా వెళ్లి వస్తూ పొత్తు కార్యాన్ని విజయవంతం చేసుకున్నారు. జీవితమంతా మతతత్వ పార్టీ భాజపాను విమర్శిస్తూ వచ్చిన దేవేగౌడ రాజకీయ చరమాంకంలో పార్టీని బతికించుకునేందుకు తన భావజాలాన్ని పక్కనబెట్టారు. ప్రస్తుతం 91 ఏళ్లున్న హెచ్‌.డి.దేవేగౌడ వచ్చే ఎన్నికల సమయానికి ఇంత చురుకుగా పని చేయటం కుదరని పని.


అప్ప.. చెప్పినట్లే

2023 అసెంబ్లీ ఎన్నికలో భాజపా కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో 35 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ అంతటి వైఫల్యానికి కారణాలను వెతికిన భాజపా అధిష్ఠానానికి ‘యడియూరప్ప’ క్రియాశీలంగా లేకపోవడం ఓ కారణంగా కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ కారణం వల్లనే భాజపా ఓటమి చెందినట్లు భావించిన అధిష్ఠానం ఈ ఎన్నికల సమయానికి యడియూరప్పకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఆయన కుమారుడు బి.వై.విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడంతో యడియూరప్ప ఉత్సాహం రెట్టింపైంది. జేడీఎస్‌తో పొత్తు విషయంలోనూ యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం భాజపా పోటీలో దింపిన 25 మంది అభ్యర్థుల్లో 20 మంది అభ్యర్థులు యడియూరప్ప సూచించిన వారే కావడం గమనార్హం. తనను పదేపదే విమర్శించే వారికి టికెట్లు రాకుండా చేయడంలో యడియూరప్ప వెనుకాడలేదు. డి.వి.సదానందగౌడ, కేఎస్‌.ఈశ్వరప్ప (ఈయన కుమారుడికి టికెట్‌ ఇవ్వలేదు), ప్రతాప్‌ సింహ, బసవనగౌడ యత్నాళ్‌.. వీరంతా యడియూరప్ప వ్యూహానికి బలైనవారే. తన కుమారుడు రాఘవేంద్ర, సన్నిహితురాలు శోభా కరంద్లాజె, హితుడు వి.సోమణ్ణ తదితరులకు తీవ్ర వ్యతిరేకతల మధ్యలోనూ టికెట్‌ దక్కేలా చేసుకున్నారు. నేడు రాష్ట్ర వ్యవహారాల్లో అధిష్ఠానం విశ్వసించే ఏకైక నేత యడియూరప్ప మాత్రమే. 81ఏళ్ల వయసులోనూ యడియూరప్ప పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.


నాయకత్వానికి పరీక్ష

ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న 77 ఏళ్ల సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. వయసు రీత్యా అప్పటికి 82 ఏళ్లలో చురుకుగా ఉండలేనని ఆయన భావన. తన రాజకీయ ప్రయాణంలో దాదాపు చివరి ఎన్నికలుగా భావించే ఈ లోక్‌సభ ఎన్నికలు సిద్ధరామయ్య నాయకత్వానికి పరీక్ష కానున్నాయి. విధానసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత డీకే శివకుమార్‌ నుంచి సీఎం కుర్చీకి పోటీ ఎదుర్కొన్న సిద్ధరామయ్యకు ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 2019 ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ ప్రస్తుత ఎన్నికల్లో 20 స్థానాల లక్ష్యంతో బరిలో దిగింది. ఇందులో కనీసం సగం స్థానాలు గెలిస్తేనే సిద్ధరామయ్య సీఎంగా కొనసాగగలరు. లేదంటే బాధ్యత వహిస్తూ అధికార పంపిణీకి సిద్ధం కావాలి. ఈ సున్నిత సూత్రాన్ని అంచనా వేసిన సిద్ధరామయ్య అభ్యర్థుల ఎంపికలో తన నిర్ణయానికి పెద్ద పీట వేయించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు మంత్రుల పిల్లలకు టికెట్‌ దక్కాయంటే అది సిద్ధరామయ్య ప్రయత్న ఫలితమే. అహింద (బడుగు, బలహీన, మైనారిటీ) ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు దక్కేలా చేసేందుకు సిద్ధరామయ్య జిల్లా స్థాయిలో ఆ వర్గాల నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 28 స్థానాల్లో 20 జిల్లాలకు బాధ్యత వహించే మంత్రులంతా సిద్ధరామయ్య ఆప్తులుగా ఉన్నవారే.


ఖర్గే పోరు

జాతీయ నాయకుల కరిష్మా భాజపాకు ఉన్నంత స్థాయిలో కాంగ్రెస్‌కు లేదు. కర్ణాటకలో ఆ లోటును తీర్చగలిగే నేత మల్లికార్జున ఖర్గే ఒక్కరే. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న 82 ఏళ్ల వృద్ధ నేతకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. తన రాజకీయ జీవితంలో తొలి అపజయాన్ని అందించిన 2019 ఎన్నికలు ఆయనకు కొత్త పదవులు అందేలా చేశాయి. 2020 జూన్‌ 12న రాజ్యసభకు నామినేట్‌ అయిన ఖర్గే మరో నాలుగు నెలలకు ఏఐసీసీ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుత హోదా కారణంగా ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించడం ఖర్గేకు ఎంతో కీలకం. కర్ణాటక అంతటా కాకపోయినా ఉత్తర కర్ణాటకలో ఖర్గే ప్రభావం ప్రధాని మోదీతో పోటీ పడుతుంది. ఆ కారణంగానే ఈ ఎన్నికల్లో మోదీ తన తొలి కర్ణాటక ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచే ప్రారంభించడం గమనార్హం. 2019 వరకు తాను ప్రాతినిథ్యం వహించిన కలబురగి స్థానానికి అల్లుడు రాథాకృష్ణ దొడ్డమనిని పోటీలో దింపిన ఆయన ఈ ప్రాంతంలోని 14 స్థానాల్లో 12 మంది అభ్యర్థులను తన వ్యూహం ప్రకారం నిలబెట్టారు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి 20 స్థానాల్లో గెలిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని