అక్కడ తొలిసారి పోలింగ్‌

ఆ ప్రాంతమంతా మావోయిస్టులకు కంచుకోట. ఎన్నికల సమయంలో అక్కడకు సిబ్బంది చేరుకోవడం దుర్లభం. అందుకే చాలామందికి ఓట్ల పండుగంటే తెలియదు.

Updated : 08 Apr 2024 06:13 IST

ఎన్నికల సిబ్బందైనా హెలికాప్టర్లో వెళ్లాల్సిందే
మావోయిస్టుల కంచుకోటలో ఓట్ల సందడి

రాంచీ: ఆ ప్రాంతమంతా మావోయిస్టులకు కంచుకోట. ఎన్నికల సమయంలో అక్కడకు సిబ్బంది చేరుకోవడం దుర్లభం. అందుకే చాలామందికి ఓట్ల పండుగంటే తెలియదు. తెలిసినా గత కొన్ని దశాబ్దాలుగా చేతివేలికి సిరాచుక్క వేసుకునే అవకాశం రానివారు అనేకమంది ఉన్నారు. అలాంటిచోట ఇప్పుడు తొలిసారిగా అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ (సింహ్‌భూమ్‌) లోక్‌సభ స్థానంలో అనేకమంది ఓటర్లు తొలిసారిగా మే 13న ఓట్లు వేయబోతున్నారు. ఆసియాలో అత్యంత దట్టమైన సాల్‌ అడవుల్లో విస్తరించిన నియోజకవర్గం పరిస్థితి ఇది. ఇక్కడి మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల సంఘం ఈసారి ఏర్పాటు చేస్తోంది. పోలింగ్‌ బృందాలను, సామగ్రిని హెలికాప్టర్లలో తరలించనున్నారు. ఒక్క ఓటరు కూడా పోలింగుకు దూరం కాకూడదనే లక్ష్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుగ్డి, బొరెరో వంటి ప్రాంతాల్లోని ప్రజలు జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ సిబ్బంది కొన్నిచోట్ల నాలుగైదు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిందే.

46  ఘటనలు..  22  మరణాలు..

గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినా పశ్చిమ సింగ్‌భమ్‌ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఇప్పటికీ అధికంగా ఉంది. ఇక్కడ గతేడాది 46 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా వాటిలో 22 మంది మరణించారు. గతంలో మావోలు ఇక్కడి తాల్కోబాద్‌ ప్రాంతంలోని 22 గ్రామాలను ‘విముక్త ప్రదేశాలు’గా ప్రకటించారు. కానీ భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహించి అక్కడ పట్టు సాధించాయి. ఈ ప్రాంతంలో 15 క్యాంపులను కొత్తగా ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సతీమణి గీత ఈ ఎస్టీ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఝార్ఖండ్‌లో ఏకైక ఎంపీగా ఉన్న ఆమె ఈసారి భాజపా టికెట్‌పై బరిలోకి దిగనున్నారు. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని