కాంగ్రెస్‌, ఆప్‌ కలయికతో మేలెంత?

గుజరాత్‌లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల కలయిక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 08 Apr 2024 06:13 IST

గుజరాత్‌లో భాజపాను అడ్డుకుని ‘ఇండియా’ నెగ్గుకొచ్చేనా..
అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటివి కలిపినా భాజపాకే ఎక్కువ ఓట్లు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల కలయిక లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందా.. భాజపాను అడ్డుకుని అవి నెగ్గుకురాగలవా.. కాషాయదళం క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోగలవా.. అనేది ఆసక్తికరంగా మారింది.

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ విడివిడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కంటే భాజపాకే అధికంగా ఓట్లు వచ్చాయి. దీంతో గుజరాత్‌లో మళ్లీ క్లీన్‌స్వీప్‌ చేస్తామనే ధీమాను భాజపా వ్యక్తం చేస్తోంది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ‘ఇండియా’ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 26 సీట్లనూ భాజపా గెలుచుకుంది.

ఎన్నో మార్పులొచ్చాయంటున్న కూటమి

ప్రస్తుతం గుజరాత్‌లో ఎన్నో మార్పులొచ్చాయని ఇండియా కూటమి అంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెబుతోంది. ఓటర్ల సెంటిమెంటులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటోంది. గతం కంటే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించగలమనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

  • గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లను గెలుచుకున్న భాజపాపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఇండియా కూటమి భావిస్తోంది.
  • ఆప్‌ ఇండియా కూటమిలో భాగస్వామి అని, గుజరాత్‌లో తమదే పెద్దన్న పాత్రని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ దోషి తెలిపారు. ప్రతిపక్షాల్లో చీలికను కూటమి నిలువరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
  • గుజరాత్‌లో కాంగ్రెస్‌ 24 సీట్లలో, ఆప్‌ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
  • భావ్‌నగర్‌, భరూచ్‌ సీట్లలో ఆప్‌ గెలుపునకు కాంగ్రెస్‌ తీవ్రంగా కృషి చేస్తోంది.
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల విభజనతో భాజపా లాభపడిందనేది కాంగ్రెస్‌, ఆప్‌ల భావనగా ఉంది.
  • ప్రస్తుతం ముఖాముఖి పోటీ తమకు లాభిస్తుందనేది ఆప్‌ వాదనగా ఉంది.

గతంలో కాషాయదళానిదే ఆధిపత్యం

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 52.50శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌, ఆప్‌లకు కలిపి 40.2 శాతం ఓట్లు వచ్చాయి.

  • 182 అసెంబ్లీ సీట్లలో భాజపా 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 17, ఆప్‌నకు 5 సీట్లు దక్కాయి.
  • కాంగ్రెస్‌, ఆప్‌ల కలయిక స్వల్ప ప్రభావమే చూపనుందని, తమ విజయాన్ని అడ్డుకునేంతగా లేదని గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. తాము ఒక్కో నియోజకవర్గంలో 5లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
  • భరూచ్‌ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి మన్‌సుఖ్‌ వాసవ ఏడోసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • భరూచ్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 భాజపా గెలుచుకుంది.

ఎమ్మెల్యేలే ఆప్‌ అభ్యర్థులు

2022లో ఆప్‌ గెలిచిన 5 అసెంబ్లీ సీట్లలో రెండు భరూచ్‌, భావ్‌నగర్‌లలో ఉన్నాయి. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే ఇప్పుడు లోక్‌సభ బరిలో నిలిచారు. భరూచ్‌లో గిరిజన ప్రాబల్యం అధికం. 1989 వరకూ ఇది కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాతి నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది.

రూచ్‌లో చైతార్‌ వాసవ బరిలో నిలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో దేదియాపడ నుంచి గెలిచారు.


ఇదీ లెక్క

  • గత అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్‌లో భాజపాకు 6.16 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌, ఆప్‌లకు కలిపితే 4.74లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాజపాకు 51శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ 26శాతం, ఆప్‌ 13శాతం ఓట్లు సాధించాయి. రెండు కలిపినా భాజపా కంటే 12శాతం తక్కువే. భరూచ్‌లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్‌ డిపాజిట్లు కోల్పోయింది.
  • భావ్‌నగర్‌లో భాజపాకు 6.14 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి 4.91 లక్షల ఓట్లు సాధించాయి.
  • 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 128 మంది ఆప్‌ అభ్యర్థులు, 41 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని