ఫైర్‌బ్రాండ్‌ వర్సెస్‌ రాజమాత

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఆసక్తికర పోరు నెలకొంది. తృణమూల్‌ నేత, ఫైర్‌బ్రాండ్‌, మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహువా మొయిత్రా ఒకవైపు, స్థానిక రాజ కుటుంబానికి చెందిన రాజమాతగా పిలిచే అమృతా రాయ్‌ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు.

Updated : 08 Apr 2024 06:30 IST

ఆసక్తికరంగా పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌ పోరు

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఆసక్తికర పోరు నెలకొంది. తృణమూల్‌ నేత, ఫైర్‌బ్రాండ్‌, మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహువా మొయిత్రా ఒకవైపు, స్థానిక రాజ కుటుంబానికి చెందిన రాజమాతగా పిలిచే అమృతా రాయ్‌ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ జరగనుంది.


మహువా మొయిత్రా

కృష్ణానగర్‌లో గత ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత అనర్హతకు గురైన 49ఏళ్ల మహువా మొయిత్రాకే తృణమూల్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చింది. ఆవేశపూరిత ప్రసంగాలతో, మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఆమె ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేయడంద్వారా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్న ఆరోపణలతో ఆమెపై అనర్హత వేటు పడింది. తన ఎంపీ లాగిన్‌ వివరాలను ఇతరులకు ఇచ్చిన వ్యవహారంలోనూ వివాదాస్పదమయ్యారు.


అమృతా రాయ్‌

కృష్ణానగర్‌ రాజ కుటుంబానికి చెందిన రాజమాత అమృతా రాయ్‌కు భాజపా టికెటిచ్చింది. మహారాజు కృష్ణమచంద్ర రాయ్‌ను పెళ్లాడిన ఆమె ‘రాణి మా’గా రాజమాతగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి భాజపా టికెట్‌ ఇచ్చింది.


ఇద్దరూ ఇద్దరే..

 • ఆధునిక కాలానికి చెందిన మధ్య తరగతి మహిళకు, సంప్రదాయ సంపన్న వర్గానికి చెందిన మహిళకు మధ్య ఈ పోరు సాగుతోంది.
 • గత ఎన్నికల్లో మొయిత్రాకు 60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది.
 • ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌-ఉద్‌-దౌలా పోరాడుతుంటే రాజ వంశం.. బ్రిటీషర్లకు మద్దతుగా నిలిచిందని తృణమూల్‌ విమర్శలు చేస్తోంది. రాయ్‌ వంశం దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తోంది.
 • అయితే మొఘల్‌ రాజులకు వ్యతిరేకంగా కృష్ణమచంద్ర రాజ కుటుంబం పోరాడిందని భాజపా అంటోంది. సిరాజ్‌-ఉద్‌-దౌలా హయాంలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తోంది.
 • జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా ఉన్న మొయిత్రా ఆ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు.
 • గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఆమె 2019లో కృష్ణానగర్‌ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు.
 • అమృతా రాయ్‌ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌.

ఇదీ కృష్ణానగర్‌

 • కృష్ణానగర్‌లో 17 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలోని 87శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
 • నియోజకవర్గంలో 55శాతం హిందువులు, 35శాతం ముస్లింలున్నారు.
 • ఎస్సీలు 22.57శాతం, ఎస్టీలు 1.69శాతం ఉన్నారు.
 • బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మతువా జనాభా కూడా గుర్తించదగిన స్థాయిలోనే ఉంటుంది. సీఏఏ వల్ల వీరికి అధికంగా లబ్ధి కలగనుంది.
 • 1967లో ఏర్పడిన కృష్ణానగర్‌లో 2004 వరకూ సీపీఎంకు తిరుగులేదు. 1999లో మాత్రం ఇక్కడ భాజపా గెలిచింది. 2009 నుంచి తృణమూల్‌ వరుసగా 3 సార్లు గెలిచింది.
 • 2019 ఎన్నికల్లో భాజపాకు 40శాతం ఓట్లు వచ్చాయి. లెఫ్ట్‌కు 8.8శాతం, కాంగ్రెస్‌కు 2.8శాతం ఓట్లు దక్కాయి.

కృష్ణానగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని