గ్యారంటీలపై విస్తృత ప్రచారం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు.

Updated : 08 Apr 2024 05:58 IST

జాతీయ మ్యానిఫెస్టో అంశాలూ ప్రజలకు చెప్పండి
పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
సికింద్రాబాద్‌, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్ష

ఈనాడు-హైదరాబాద్‌, రంగంపేట-న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ హామీలపైనా ఇంటింటికీ విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. సీఎం ఆదివారం తన నివాసంలో సికింద్రాబాద్‌, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమీక్షలు జరిపారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సునాయాసమేనని ధీమా వ్యక్తం చేశారు. భారాసకు ప్రజల్లో బలం లేదని.. ఆ పార్టీకి ఓటు వేస్తే వృథాయే అన్న నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో చురుగ్గా పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించాలని, వారితో ఇంటింటి ప్రచారం చేయించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు ఆధిక్యంతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి మండల, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి వరకూ పార్టీ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

కిషన్‌రెడ్డిపై వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవాలి..

కిషన్‌రెడ్డి.. తాను సిటింగ్‌ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి గాని, రాష్ట్రానికి గాని ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని సానుకూలంగా మలచుకునేలా పెద్దఎత్తున ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున విజయారెడ్డి, భారాస తరఫున దానం నాగేందర్‌ పోటీపడగా.. దానం నెగ్గిన విషయం తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఇరువురు నేతలూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీల కన్నా రెట్టింపు రావాలి..

వరంగల్‌ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి సూచించారు. ఆమె గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్‌, ఇతర పార్టీల పరిస్థితులపై రేవంత్‌ సమీక్షించారు. ‘వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు వెంటనే నిర్వహించాలి. తర్వాత మండలస్థాయి ప్రచార కమిటీల సమావేశాలు పెట్టాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నేతలతో కలసి సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి’ అని రేవంత్‌రెడ్డి సూచించారు. వరంగల్‌ ఎంపీ టికెట్‌ కోసం పోటీపడిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్‌ తదితరులను సమావేశానికి సీఎం పిలిపించి మాట్లాడారు. టికెట్‌ రాలేదని నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో మంచి అవకాశాలు కల్పిస్తామని, లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. వరంగల్‌ నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), కడియం శ్రీహరి (స్టేషన్‌ ఘన్‌పూర్‌), నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ పశ్చిమ), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కేఆర్‌ నాగరాజు (వర్ధన్నపేట), ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర ముఖ్యనేతలు, సికింద్రాబాద్‌ నియోజకవర్గ సమావేశంలో అభ్యర్థి దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, నేతలు అజారుద్దీన్‌, రోహిన్‌రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌, కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని