కాంగ్రెస్‌ అధికారం చేపడితే జిన్నా రాజ్యాంగం వస్తుంది

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 09 Apr 2024 06:24 IST

జూన్‌ 8 లేదా 9న హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ను తొలగిస్తామని చెప్పి ఇప్పటికే అమలు చేశామని, జమ్మూకశ్మీర్‌లో జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తెచ్చామని తెలిపారు. మళ్లీ జిన్నా రాజ్యాంగాన్ని తెస్తామని రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, లవ్‌ జిహాద్‌ని చట్టపరం చేస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలో, పోలీసుశాఖలో లవ్‌ జిహాద్‌ను కాపాడే విభాగం ఏర్పాటు చేశారా అని సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ జూన్‌ 8 లేదా 9న ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బూత్‌స్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాలు ఉండేవని, భాజపా అధికారం చేపట్టాక అలాంటివి అణచివేశామన్నారు. గతంలో అన్ని వస్తువులు విదేశాల నుంచి వచ్చేవని.. మోదీ వచ్చాక ఆటబొమ్మల నుంచి చంద్రయాన్‌ వరకు మనమే తయారు చేస్తున్నామని చెప్పారు. రక్షణశాఖ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం వెలుగుచూసేదని ఎద్దేవా చేశారు. ఇలా పదేళ్ల కాలంలోనే రూ.12 లక్షల కోట్ల విలువ చేసే కుంభకోణాలు జరిగాయన్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల భాజపా పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో.. హిందూ వ్యతిరేకి

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హిందూ వ్యతిరేకంగా ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు అనేక హామీలను గతంలో తుక్కుగూడ వేదికగా రాహుల్‌ ఇచ్చారని.. వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. డిసెంబరులో రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. అనేక పోరాటాల తర్వాత మోదీ హయాంలో అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నామని, గతంలో లౌకికవాదం పేరుతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ కూర్చుందని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. దేశ గౌరవాన్ని పెంచేందుకు.. అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈసారి రెండంకెల స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ, భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి నేతలు శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని