కొబ్బరి నేలను కొట్టేదెలా?

దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి  సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Updated : 09 Apr 2024 07:22 IST

కేరళ జననాడిని పట్టలేకపోతున్న భాజపా
ఆర్‌ఎస్‌ఎస్‌కు గట్టి పట్టున్నా దక్కని ప్రాభవం
పాగాకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాషాయదళం

దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి  సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా ఆ రాష్ట్రం ఓటరు నాడి పార్టీకి అంతు చిక్కడం లేదు. విజయం దక్కడం లేదు. ఈసారీ భాజపా అంతే గట్టిగా పోరాటానికి సిద్ధమైంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దిగింది. దీంతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళలో జరగనున్న ముక్కోణ పోటీపై ఆసక్తి నెలకొంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాబల్యం ఎక్కువే..

దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కేరళలోని యువ కమ్యూనిస్టులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1977 నుంచి 1982 వరకు వారి వలసలు కొనసాగాయి. వారంతా సంస్థ అభివృద్ధికి తోడ్పడ్డారు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల సంఖ్య ఈ రాష్ట్రంలో అధికంగా ఉంది. ఇక్కడ 5,142 మంది శాఖలు ఉన్నాయి. ఇది హిందుత్వ ప్రాబల్య రాష్ట్రాలుగా చెప్పుకొనే ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఉన్నవాటి కంటే చాలా ఎక్కువ. సంస్థ బాగా విస్తరించడంతో ఇటీవలే రెండు ప్రాంతాలుగా కేరళను ఆర్‌ఎస్‌ఎస్‌ విభజించింది.

సంఘ్‌ ఆధిపత్యమున్నా కేరళలో భాజపా కాలుమోపలేకపోతోంది. ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు ఎదగలేకపోతోంది.

మొదటిదీ.. చివరిదీ..

స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లోనే కేరళలో కమ్యూనిస్టులు సత్తా చాటారు. 1957లోనే ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికమో ఏమోగానీ ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చివరి రాష్ట్రమూ కేరళే అయింది. పశ్చిమ బెంగాల్‌, త్రిపురల్లో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్నారు.


క్రిస్టియన్లపై భాజపా గురి

 • కేరళలో ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి 46శాతం ఉన్నారు. ఇది భాజపాకు పెద్ద మైనస్‌. క్రిస్టియన్ల ఓట్లను సాధించేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్‌ ఆంటోనీని పార్టీలో చేర్చుకుంది.
 • కేరళ జనపక్షం పార్టీ (సెక్యులర్‌) అధినేత పీసీ జార్జి తన పార్టీని భాజపాలో విలీనం చేశారు.
 • కేరళ జనాభాలో హిందువులైన ఎజావాలు 25శాతం, నాయర్లు 12.5 శాతం ఉంటారు. నాయర్లు మూకుమ్మడిగా ఏ ఒక్క పార్టీకీ ఓటు వేయరు. ఎజావాలు సంప్రదాయంగా లెఫ్ట్‌నకు మద్దతిస్తుంటారు.
 • రాష్ట్రంలోని 54శాతం మంది హిందువుల్లో సగం మంది లెఫ్ట్‌ మద్దతుదారులే. బ్రాహ్మణ వర్గానికి చెందిన నంబూద్రీలూ కమ్యూనిస్టులకు మద్దతు పలుకుతారు.
 • ఎజావాల ఓట్లను సాధించేందుకు భారతీయ ధర్మ జనసేనతో భాజపా పొత్తు పెట్టుకుంది.

పెరుగుతున్న ఓట్ల శాతం

కేరళలో భాజపా ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. మొత్తం 25,000 పోలింగ్‌ బూత్‌లలో 22,000 చోట్ల తమ ఉనికి ఉందని పార్టీ నేతలు తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 16.5శాతం ఓట్లు సాధించామని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏడెనిమిది నియోజకవర్గాల్లో 30శాతానికిపైగా ఓట్లు సాధించామని వెల్లడించారు. త్వరలో ఇవి సీట్లుగా మారనున్నాయని వివరించారు.

 • ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు 1,000 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇది తమిళనాడు కంటే అధికం.
 • ఈసారి రాష్ట్రంలోని యువత తమకు మద్దతు పలకనున్నారని భాజపా నేతలు అంటున్నారు. అదే జరిగితే ఎమర్జెన్సీ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లోకి కమ్యూనిస్టులు వచ్చినట్లుగా మార్పు తథ్యమని చెబుతున్నారు.

విభజన ఉన్నా ఓటింగ్‌లో కనిపించదు

కేరళ సమాజంలో మతపరమైన విభజన ఉన్నా ఓటింగ్‌ సమయంలో పెద్దగా కనిపించదని లెఫ్ట్‌ నేతలు పేర్కొంటున్నారు. బహుశా చదువుకున్నవారు, రాజకీయంగా చైతన్యం కలవారు కావడమే ఇందుకు కారణమని వారు వివరిస్తున్నారు. ప్రగతిశీల కేరళ ఎన్నటికీ విభజన రాజకీయాలను అంగీకరించదని అంటున్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుగుదల కూడా ఫేక్‌ అని వారంటున్నారు.


‘ఈసారి సత్తాచాటుతాం’

భౌగోళిక పరిస్థితులు, ఓట్ల బదిలీల్లో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ వ్యూహాలు తమకు ప్రతికూలంగా పని చేస్తున్నాయని కేరళ భాజపా నేత ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాగా వేస్తామని తెలిపారు.


భాజపా ఎందుకు ఎదగడం లేదంటే..

కేరళలో భాజపా ఎదగకపోవడానికి ఆశ్చర్యకరమైన   కారణాలున్నాయని సంఘ్‌ నేత ఒకరు తెలిపారు. మొత్తం నాలుగు అడ్డంకులు ఆ పార్టీని ఎదగనీయడం లేదని వివరించారు. అవి

 •  భౌగోళిక పరిస్థితులు
 • లెఫ్ట్‌, కాంగ్రెస్‌ ఫ్రంట్‌ల మధ్య ఓట్ల బదిలీ
 • లెఫ్టిస్ట్‌ ప్రచారం
 •  స్థానిక భాజపా నేతల హత్యలు
 • 1960ల చివరి నుంచి ఇప్పటిదాకా 300 మంది నేతలను భాజపా కోల్పోయింది. 1980లలో వందల మందిని పోగొట్టుకుంది. ఈ ఘటనలు జరగకుండా ఉండి ఉంటే కర్ణాటకలో మాదిరిగా అధికారం చేపట్టేవాళ్లమని కేరళ భాజపా ఐటీ సెల్‌ హెడ్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. కేరళలో భాజపా నేతల హత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయని ఆయన తెలిపారు.
 • కేరళలోని భాజపా, సంఘ్‌, ఏబీవీపీ నేతలపై వందల కేసులు పెడుతున్నారని, వారిని పోలీసులు కొడుతున్నారని జైశంకర్‌ వివరించారు. ఇక్కడ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్‌ నేతలతో డీల్‌ చేయాల్సి వస్తోందని ఆయన వెల్లడించారు.
 • కేరళలో భాజపాకు జనాకర్షక నేతలు లేకపోవడమూ పెద్ద మైనస్సే. తమిళనాడులో ఉన్న అన్నామలై లాంటి నేత కేరళలో లేరు.
 • సంఘ్‌, భాజపాలు స్వేచ్ఛా వ్యతిరేక పార్టీలని కమ్యూనిస్టులు విపరీతంగా ప్రచారం చేసి దెబ్బతీశారు. దీనివల్ల ఇక్కడి ప్రజలు భాజపాతో మమేకం కాలేకపోయారు.
 • భాజపాకు ఓటేస్తే వృథా అవుతుందని ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రచారమూ నష్టం కలగజేస్తోంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని