గాంధీల్లేని పీలీభీత్‌.. 3 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి

మూడు దశాబ్దాలకుపైగా గాంధీలు ప్రాతినిధ్యం వహించిన పీలీభీత్‌ ఈసారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది.

Updated : 09 Apr 2024 08:08 IST

పీలీభీత్‌: మూడు దశాబ్దాలకుపైగా గాంధీలు ప్రాతినిధ్యం వహించిన పీలీభీత్‌ ఈసారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఈ నియోజకవర్గానికి 30ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. భాజపాపై విమర్శలు చేసిన సిటింగ్‌ ఎంపీ వరుణ్‌ గాంధీకి ఈసారి భాజపా టికెట్‌ ఇవ్వలేదు.

స్థానికేతరుడికి టికెట్‌

తొలి విడతలోనే పీలీభీత్‌లో పోలింగ్‌ జరగనుంది. ఈసారి రాష్ట్ర మంత్రి జితిన్‌ ప్రసాదను భాజపా బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ నేత అయిన జితిన్‌ ప్రసాద 2004, 2009 ఎన్నికల్లో షాజహాన్‌పుర్‌, ధరువాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2021లో ఆయన భాజపాలో చేరారు. రాష్ట్ర మంత్రి అయ్యారు. అయితే ఆయన పీలీభీత్‌కు పూర్తిగా కొత్త, స్థానికేతరుడు.

నేపాల్‌ సరిహద్దులో..

నేపాల్‌ సరిహద్దులోని తేరాయ్‌ బెల్ట్‌లో పీలీభీత్‌ నియోజకవర్గం ఉంది. 18 లక్షల మంది ఓటర్లున్నారు. ముస్లింలు, లోధీల తర్వాత కుర్మీలు అత్యధికంగా ఉంటారు. మౌర్యులు, పాసీలు, జాటవ్‌లు కీలకంగానే ఉంటారు. బెంగాలీలు, బ్రాహ్మణులు, సిక్కులూ ఇక్కడ బాగానే ఉన్నారు. పీలీభీత్‌ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. బహెరి, పీలీభీత్‌, బార్ఖెరా, పురాన్‌పుర్‌, బిలాస్‌పుర్‌ దీని పరిధిలోకి వస్తాయి. ఇందులో నాలుగు సీట్లను భాజపా, ఒకటి సమాజ్‌వాదీ గెలుచుకున్నాయి.

1989 నుంచి..

పీలీభీత్‌లో తొలిసారిగా జనతాదళ్‌ నుంచి మేనకా గాంధీ ఎన్నికయ్యారు. 1991లో ఓడిపోయారు. 1996లో మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి గాంధీలే వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998, 1999లో స్వతంత్ర అభ్యర్థిగా మేనకా గాంధీ పోటీ చేసి గెలిచారు. 2004, 2014లో భాజపా అభ్యర్థిగా విజయం సాధించారు. 2009, 2019లో పీలీభీత్‌ నుంచి వరుణ్‌ గాంధీ ఎన్నికయ్యారు. 2019లో తాను గెలిచిన సుల్తాన్‌పుర్‌లో మరోసారి మేనకా గాంధీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


వరుణ్‌తో అనుబంధం

స్థానికులు మాత్రం వరుణ్‌ గాంధీతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జితిన్‌ ప్రసాద ప్రభావం ఇక్కడ పెద్దగా లేదు. ఆయనను స్థానికేతరుడిగా చూస్తున్నారు’ అని రిటైర్డ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఒకరు తెలిపారు. వరుణ్‌ గాంధీకి పీలీభీత్‌లో ఎప్పటి నుంచో సంబంధాలున్నాయని, అది గాఢానుబంధమని, తనకు టికెట్‌ నిరాకరించిన తర్వాత ఆయన రాసిన లేఖద్వారా ఇదే విషయం వెల్లడైందని స్థానిక గ్రామ పెద్ద ఒకరు వెల్లడించారు. టికెట్‌ ఇవ్వకపోయినా పీలీభీత్‌ ప్రజలతో తన బంధం కొనసాగుతుందని లేఖలో వరుణ్‌ పేర్కొన్నారు. పార్టీ మద్దతు తనకే ఉందని జితిన్‌ ప్రసాద చెబుతున్నా అధిష్ఠానం నిర్ణయంపై స్థానిక నాయకత్వం అసంతృప్తిగానే ఉంది.

  • టికెట్‌ నిరాకరించిన తర్వాత వరుణ్‌ గాంధీ పీలీభీత్‌కు రాలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. మంగళవారం జరిగే ప్రధాని సభలోనూ పాల్గొనేది అనుమానమే.
  • సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడ భగవత్‌ శరణ్‌ గంగ్వార్‌ను బరిలోకి దింపింది. ఆయనకు కుర్మీల్లో పట్టు ఉంది.బీఎస్పీ తరఫున అనీస్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని