గిరిజన ఓట్లపై ‘ఇండియా’ దృష్టి

గుజరాత్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌-ఆప్‌ కూటమి దృష్టి సారించింది.

Updated : 09 Apr 2024 06:14 IST

గుజరాత్‌లో విజయానికి ప్రయత్నం
భాజపాకూ గట్టిపట్టే

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌-ఆప్‌ కూటమి దృష్టి సారించింది. ఈ ఓటర్లను ఆకట్టుకోవడంద్వారా విజయానికి బాటలు వేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భాజపాకు గట్టి పట్టు ఉండటం గమనార్హం.

మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్‌ జరగనున్న గుజరాత్‌లోని దాహోద్‌, ఛోటా ఉదయ్‌పుర్‌, బార్దోలీ, వల్సాద్‌లు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. వీటితోపాటు భరూచ్‌లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ.

అసెంబ్లీ ఎన్నికల్లో చీలిక

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లగలిగింది. గిరిజన నియోజకవర్గమైన డేడియాపాడాలో విజయం సాధించింది. ఇది భరూచ్‌ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్‌ కూడా ఈ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర వీటి మీదుగా సాగింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఈ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అప్పట్లో ఆప్‌, కాంగ్రెస్‌, భారతీయ ట్రైబల్‌ పార్టీల (బీటీపీ) మధ్య ఓట్లు చీలిపోవడంతో భాజపా విజయం సునాయాసమైంది.

సులభం కాదా?

తొలిసారిగా గిరిజన ప్రాంతంలో పాగా వేయాలనే పట్టుదలతో ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది. అయితే అదంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చైతర్‌ వసావా గట్టి పోటీ ఇచ్చే అవకాశమున్నా భాజపాను ఓడించేంతగా ఓట్లు సాధిస్తారా అనేది అనుమానమేనని సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు, వడోదరా వర్సిటీ ప్రొఫెసర్‌ అమిత్‌ ధోలాకియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నల్లా నీరు, పక్కా ఇళ్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారంతో భాజపాకు అనుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు సరైన గిరిజన నేత లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. 2014కు ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు గట్టి పట్టుండేది. ఆ తర్వాత చాలామంది గిరిజన నేతలు కాంగ్రెస్‌ నుంచి భాజపాకు మారారు. మోహన్‌సింగ్‌ రాఠవా ఛోటా ఉదయ్‌పుర్‌ నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. తాజాగా మాజీ ఎంపీ నరన్‌ రాఠవా కూడా పార్టీ మారారు. బీటీపీ జాతీయ అధ్యక్షుడు మహేశ్‌ వసావా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. బీటీపీ ప్రతిపక్ష ఓట్లను చీల్చే అవకాశముందని ధోలాకియా చెబుతున్నారు.


అభ్యర్థులను మార్చిన భాజపా

బార్దోలీ, దాహోద్‌లలో సిటింగ్‌ ఎంపీలు ప్రభు వసావా, జస్వంత్‌సింగ్‌ భాభోర్‌లను కొనసాగించిన భాజపా.. ఛోటా ఉదయ్‌పుర్‌ సిటింగ్‌ ఎంపీ గీతాబెన్‌ రాఠవాను మార్చి జుశుభాయ్‌ రాఠవాకు టికెటిచ్చింది. వల్సాద్‌లోనూ కేసీ పటేల్‌ను మార్చి ధవల్‌ పటేలకు టికెటిచ్చింది.

కాంగ్రెస్‌ తరఫున..

వల్సాద్‌లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అనంత్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు. బార్దోలీలో సహకార సంఘం నేత సిద్ధార్థ చౌధరిని పార్టీ బరిలోకి దింపింది. దాహోద్‌లో ప్రభా తావియాడ్‌ పోటీ చేస్తున్నారు. ఛోటా ఉదయ్‌పుర్‌లో సుఖ్‌రాం రాఠవా బరిలోకి దిగారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 59 స్థానాల్లో కాంగ్రెస్‌-ఆప్‌ ఓట్లు కలిస్తే భాజపా కంటే ఎక్కువ వచ్చాయని వల్సాద్‌ అభ్యర్థి అనంత్‌ పటేల్‌ చెబుతున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలోని పలు అంశాలు తమ విజయానికి దోహదం చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులు, జింక్‌ స్మెల్టర్‌ ప్రాజెక్టు కోసం తమ భూములను సేకరించడంపై గిరిజనులు ఆగ్రహంగా ఉన్నారని ఆయన అంటున్నారు.


రెండు చోట్ల ఆప్‌ పోటీ

పొత్తులో భాగంగా భరూచ్‌, భావ్‌నగర్‌ సీట్లను ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ ఇచ్చింది. భరూచ్‌ జనరల్‌ నియోజకవర్గమైనా భాజపా, ఆప్‌-కాంగ్రెస్‌ కూటములు గిరిజన అభ్యర్థులకే టికెట్లిచ్చాయి. భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ మన్‌సుఖ్‌ వసావానే బరిలోకి దిగారు. ఆప్‌ తరఫున డేడియాపాడా ఎమ్మెల్యే చైతర్‌ వసావా పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని