ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది.

Updated : 10 Apr 2024 06:24 IST

లోక్‌సభ ఎన్నికలకు కమలదళం కార్యాచరణ
అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి
రెండంకెల స్థానాల సాధనపై గురి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో పది, అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎనిమిది శాసనసభ స్థానాల్లోనే గెలిచినా.. గతంలో కన్నా ఓట్ల శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది. నాలుగు సిటింగ్‌ స్థానాలతో పాటు మరో ఆరు నియోజకవర్గాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే వ్యూహాత్మకంగా అన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుని బరిలో దింపింది. భారాసకు చెందిన ఓ సిటింగ్‌ ఎంపీకి, మరో సిటింగ్‌ ఎంపీ కుమారుడికి, ఇద్దరు మాజీ ఎంపీలకు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది. ఇతర స్థానాల్లోనూ ముఖ్యనేతలను అభ్యర్థులుగా ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ.. సర్వేలు

రాష్ట్రంలో పార్టీ విజయానికి ఉపకరించే అంశాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, చంద్రశేఖర్‌ తివారీతో చర్చించి.. కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సెగ్మెంట్ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లు.. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాలంటే ఎన్ని ఓట్లు సాధించాలో తాజాగా సమగ్రంగా విశ్లేషించారు. ఓట్ల సంఖ్యను పెంచడంలో బూత్‌స్థాయి నుంచి పకడ్బందీ కార్యాచరణ అవసరమని జాతీయ నాయకత్వం భావిస్తోంది. దీన్ని అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, రాష్ట్రంలోనూ అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి జాతీయ నేతలు స్పష్టం చేశారు.

నియోజకవర్గాల వారీగా ఇలా..

  •  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కచోట కూడా భాజపా గెలవలేదు. పైగా మొత్తం ఓట్లలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో పూర్తిగా నగర ఓటర్లే ఉన్నారు. వారిని ఆకట్టుకోవడంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
  •  భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి కరీంనగర్‌ బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సాధించిన ఓట్లపరంగా మూడో స్థానంలో ఉన్నా.. క్షేత్రస్థాయిలో కార్యాచరణను పక్కాగా అమలు చేస్తున్నట్లు ముఖ్యనేతలు విశ్లేషిస్తున్నారు.
  • నిజామాబాద్‌లో సిటింగ్‌ ఎంపీ డి.అర్వింద్‌ మరోసారి బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే.. ఇక్కడ మొదటి స్థానంలో నిలిచిన పార్టీ కంటే భాజపాకు దాదాపు 50 వేలు మాత్రమే తక్కువగా వచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. ఓట్ల లోటును అధిగమించడంతో పాటు మరిన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
  •  సిటింగ్‌ స్థానమైన ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు భాజపా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతోపాటు పార్టీ భారీగా ఓట్లు సాధించింది. ఎంపీ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు ఈసారి ఎంపీ అభ్యర్థిని మార్చింది. సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావు స్థానంలో మాజీ ఎంపీ నగేశ్‌ను బరిలో నిలిపింది.
  • హైదరాబాద్‌ నగరంతో ముడిపడి ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో అర్బన్‌ ఓటర్ల ప్రభావం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఇటీవలి సర్వేలో గుర్తించినట్లు సమాచారం. మల్కాజిగిరిలో పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అభ్యర్థి కావడంతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ 4.25 లక్షల ఓట్లు సాధించింది. దాదాపు పూర్తిగా అర్బన్‌ ఓటర్లు ఉన్న స్థానం కావడంతో ఈ నియోజకవర్గంపై నేతలు ప్రత్యేక దృష్టి సారించి.. ఆమేరకు ప్రచారం చేపట్టారు. చేవెళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని, మహబూబ్‌నగర్‌లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణను అభ్యర్థులుగా ప్రకటించిన పార్టీ.. ఆయా స్థానాల పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ సాధించే అవకాశాలపై దృష్టి సారించింది.
  • అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో సాధించిన ఓట్లపరంగా భాజపా రెండో స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ జాతీయ నాయకత్వం.. అభ్యర్థిగా మాధవీలత ఎంపిక మొదలు ఎన్నికల కార్యాచరణ వరకు పక్కాగా అమలు చేస్తోంది.
  • జహీరాబాద్‌ అభ్యర్థిగా భారాసకు చెందిన సిటింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ని భాజపా ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో.. ఇక్కడ విజయం సాధించేందుకు ఉపకరించే అంశాలపై దృష్టి సారించింది.
  • ఈ స్థానాలతో పాటు నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భువనగిరి, మెదక్‌ స్థానాలపైనా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను బరిలో దించడంతో పాటు పార్టీకి ఉన్న సానుకూలతను ఓట్లుగా మలచుకుంటే రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదనే నమ్మకంతో నేతలు ఉన్నారు. పెద్దపల్లి, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం స్థానాల్లోనూ కేంద్ర పథకాలు, కార్యక్రమాలను ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యాచరణ రూపొందించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని