కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి.

Updated : 10 Apr 2024 06:23 IST

భారాసకు ప్రతిష్ఠాత్మకంగా పార్లమెంటు పోరు
ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం
చేవెళ్లలో బహిరంగ సభతో కేసీఆర్‌ శంఖారావం

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. అధినేత కేసీఆర్‌ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర సీనియర్‌ నేతలతోనూ ప్రచారం హోరెత్తించాలని పార్టీ సంకల్పించింది.

నాలుగంచెల సమావేశాలు..

ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని పరిగణనలోకి  తీసుకొని ఈ నెల 13 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస నిర్ణయించింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా కూడా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం శాసనసభ నియోజకవర్గాల వారీగా సీనియర్‌ నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే చేవెళ్ల, మల్కాజిగిరిలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో ప్రకటించనుంది.

కేసీఆర్‌ సభలు, బస్సుయాత్రలు

పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం 15 లేదా 16 తేదీల్లో మెదక్‌లో నిర్వహించే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల గుండా సాగేలా బస్సు యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, కేటీఆర్‌, హరీశ్‌రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌, భాజపాల పాలనలోని లోపాలపై...

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఆది నుంచి ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై అనుసరించిన వైఖరి సరికాదన్న అంశాలను ప్రచారంలో ఎలుగెత్తి చాటాలని భారాస భావిస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించనుంది. ఇప్పటికే భారాస అధినేత కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట, యాదాద్రి, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.   తమ పదేళ్ల పాలన తీరును పోల్చిచూసి లోక్‌సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు విభజన హామీలను అమలు చేయకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులేవీ ఇవ్వకపోవడం వంటి అంశాలతో భాజపాను ఇరకాటంలో పెట్టాలని భారాస భావిస్తోంది. త్రిముఖ పోటీలో ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్‌, భాజపాల మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూ.. ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెశ్లాలని, అది పరోక్షంగా తమకు లాభిస్తుందని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని