పోలీసుస్టేషన్‌పై పేర్ని నాని దండయాత్ర

నిన్నటివరకు మాజీ మంత్రి పేర్ని నాని కనుసన్నల్లోనే కృష్ణా జిల్లాలో పోలీసు యంత్రాంగం నడిచేది.. ఎన్నికల కోడ్‌ పుణ్యమాని ఆ శాఖ కాస్త స్వతంత్రంగా వ్యవహరించడం మొదలెట్టింది.

Updated : 10 Apr 2024 14:55 IST

పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి హడావుడి

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: నిన్నటివరకు మాజీ మంత్రి పేర్ని నాని కనుసన్నల్లోనే కృష్ణా జిల్లాలో పోలీసు యంత్రాంగం నడిచేది.. ఎన్నికల కోడ్‌ పుణ్యమాని ఆ శాఖ కాస్త స్వతంత్రంగా వ్యవహరించడం మొదలెట్టింది. ఈ క్రమంలో వైకాపా మద్దతుదారులు కొందరిని కౌన్సెలింగ్‌కు రమ్మంటూ స్టేషన్‌కు పిలవడంతో నాని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన అనుచరవర్గంతో మంగళవారం మచిలీపట్నం తాలూకా పోలీసుస్టేషన్‌పై దండయాత్ర చేశారు. ఆయన వెంట ఉన్నవారు సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతోపాటు పోలీసులను దుర్భాషలాడారు. ఎస్సై చాణక్యపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని ఒకరకంగా కొట్టినంత పనిచేశారు. ‘నీకు కొట్టే అధికారం ఎవరిచ్చారు? కొట్టాలనుకుంటే నిష్పక్షపాతంగా ఇరుపక్షాలను బీచ్‌ వద్దకు తీసుకెళ్లి ఇష్టానుసారం చితక్కొట్టేయ్‌.. ఎన్నికల కోడ్‌ వచ్చిందన్న కారణంతో తెదేపాకు కొమ్ముకాసేలా ఎలా వ్యవహరిస్తావ్‌? ఖాకీ డ్రెస్‌ వేసుకుని సీట్‌లో కూర్చునే అర్హత నీకుందా? ఈ వ్యవహారంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలి?’ అంటూ తీవ్ర స్వరంతో చాణక్యపై రెచ్చిపోయారు. సంఘటన పూర్వాపరాలివి. మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలో రెండు రోజుల కిందట నూకాలమ్మ అమ్మవారి జాతర నిర్వహించారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన తెదేపా సానుభూతిపరులైన యువకులపై గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ప్రోద్బలంతో బయటివారు దాడి చేసి గాయపర్చారు. పోలీసులు సకాలంలో రాకపోవడంతో దాడికి పాల్పడినవారికి గ్రామస్థులు తగు రీతిలో బుద్ధి చెప్పారు. దీంతో వారికీ గాయాలయ్యాయి. పరస్పర ఫిర్యాదుల మేరకు తాలూకా స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉల్లిపాలెం గ్రామ తెదేపా సానుభూతిపరులను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు సోమవారం పరామర్శించారు. దాడి సంఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

కౌన్సెలింగ్‌కు పిలవడమే నేరమా?

చికిత్స పొందాక కౌన్సెలింగ్‌ కోసం స్టేషన్‌కు రావాలని తాలూకా ఎస్సై చాణక్య ఇరుపక్షాలకు సూచించారు. దీంతో మంగళవారం వైకాపాకు చెందినవారు స్టేషన్‌ వద్దకు వెళ్లారు. తెదేపా వారి సమక్షంలో ఎస్సై తమపై ఇష్టానుసారం దాడి చేశారని, తమతోపాటు వచ్చిన కార్పొరేటర్‌ను అవమానకరంగా స్టేషన్‌ బయటే నిలబెట్టేశారంటూ బాధితులు చేసిన అభియోగాలు పేర్నికి చేరాయి. దీంతో ఆయన కార్యకర్తలతో స్టేషన్‌ వద్దకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎస్సై చాణక్య నిన్నమొన్నటి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో తమ కార్యకర్తలను తీవ్రంగా కొట్టడంతోపాటు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. వైకాపా అనుకూల అధికారిగా పేరుపడ్డ ఆయనపై మంగళవారం పేర్ని చూపించిన ఆగ్రహావేశాలు సిబ్బందినే ఆశ్చర్యపరిచేలా చేశాయి. సంఘటనపై విచారణ నిర్వహించి ఎస్పీకి నివేదిస్తామని స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ అబ్దుల్‌ సుభాని వైకాపావారికి హామీనివ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. స్టేషన్‌లో పేర్ని హడావుడి, అధికారులను దుర్భాషలాడటంపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని