రెండో విడత బరిలో 1,210 మంది

సార్వత్రిక ఎన్నికల రెండో విడత బరిలో 1,210 మంది అభ్యర్థులు నిలిచారు. 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియడంతో తుది పోరుకు రంగం సిద్ధమైంది.

Updated : 10 Apr 2024 06:13 IST

 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం
  ఔటర్‌ మణిపుర్‌లోని సగభాగంతోపాటు వీటికి 26న పోలింగ్‌ 

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో విడత బరిలో 1,210 మంది అభ్యర్థులు నిలిచారు. 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియడంతో తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నియోజకవర్గాలతోపాటు ఓటర్‌ మణిపుర్‌లోని సగ భాగానికి ఈ నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మంగళవారం ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించిన వివరాల ప్రకారం..

  •  12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు మొత్తం 2,633 నామినేషన్లు దాఖలయ్యాయి.
  •  పరిశీలన అనంతరం 1,428 నామినేషన్లు చెల్లినవిగా అధికారులు ప్రకటించారు.
  •  కొంత మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరకు 1,210 మంది బరిలో నిలిచారు.

కేరళలో 500

  •  కేరళలోని 20  నియోజకవర్గాల్లో 500 మంది బరిలో నిలిచారు.
  •  కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌ జరగనున్న 14 నియోజకవర్గాల్లో 491 మంది పోటీలో ఉన్నారు.

నాందేడ్‌లో అత్యధికంగా 92

  •  మహారాష్ట్రలోని నాందేడ్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 92 మంది బరిలో ఉన్నారు.
  •  త్రిపురలో అత్యల్పంగా ఒక నియోజకవర్గానికి 14 మందే పోటీపడుతున్నారు.

మణిపుర్‌లో..

వాస్తవానికి 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాలకు రెండో విడతలో 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అయితే ఔటర్‌ మణిపుర్‌లో తొలి విడతలోనే నామినేషన్లను స్వీకరించారు. అక్కడి 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తొలి విడతలోనే 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మిగిలిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 26న పోలింగ్‌ జరగనుంది. ఔటర్‌ మణిపుర్‌లో నలుగురు బరిలో ఉన్నారు.


బరిలోని ప్రముఖులు

కేరళలో జరగనున్న రెండో విడతలో బరిలో ఉన్న ప్రముఖుల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నీ రాజా, భాజపా కేరళ అధ్యక్షుడు సురేంద్రన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు శశి థరూర్‌, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సినీ నటుడు సురేశ్‌ గోపి తదితరులున్నారు.

 రాజస్థాన్‌లో కోటా నుంచి పోటీ చేస్తున్న స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ శెఖావత్‌ రెండో విడతలోనే పోటీని ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని