మమత X మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది.

Updated : 10 Apr 2024 06:48 IST

ఉత్కంఠ రేపుతున్న బెంగాల్‌ బరి
కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నామమాత్రమే
కోల్‌కతా నుంచి నీరేంద్ర దేవ్‌

సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్యే వ్యక్తిగత పోరు సాగుతోందన్నట్లుగా పరిస్థితి ఉంది. వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా తలపడుతుండటంతో బెంగాల్‌ ఎటు మొగ్గుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మోదీకి భద్రలోక్‌ల మద్దతు

బెంగాల్‌లో ఉన్నత స్థాయి వర్గంగా గుర్తింపు పొందిన భద్రలోక్‌లు మోదీకి గట్టి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనను వారు దేశంలో బలమైన నేతగా గుర్తిస్తున్నారు. దీంతోపాటు హిందుత్వ ఎజెండా బలాన్నిస్తోంది.


ఫైటర్‌ మమత

మమతా బెనర్జీ భాజపాకు దీటుగా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అధికారం ఒక్కరి వద్దే కేంద్రీకృతం కావడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఐటీశాఖల ద్వారా అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా దిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఏకంగా తృణమూల్‌ ధర్నాకు దిగింది. దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేసింది.


సందేశ్‌ఖాలీతో ఆందోళన

మమతను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న ఘటనే. అక్కడి మహిళలను ముస్లిం వర్గానికి చెందిన తృణమూల్‌ నేత షాజహాన్‌ షేక్‌ లైంగికంగా వేధించడం, దాడులు చేయడం భాజపాకు కలిసి వచ్చేలా చేసింది. దీనివల్ల హిందువుల ఓట్ల స్థిరీకరణ జరిగిందని భాజపా భావిస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో మమత సర్కారు జాప్యం చేయడంద్వారా ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేసిందన్న విమర్శలను ఎదుర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌, కొత్తగా ఏర్పాటైన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) కూడా తృణమూల్‌పై విమర్శలు గుప్పించాయి. సందేశ్‌ఖాలీ ప్రాంతం వచ్చే బశీర్‌హాట్‌ నియోజకవర్గంలో వేధింపులకు ఎదురుతిరిగి షాజహాన్‌ షేక్‌పై కేసు పెట్టిన రేఖా పాత్రను భాజపా నిలిపి సవాలు విసిరింది.


ఎర్రకోటకు బీటలు

  • ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట 2006 నుంచి బీటలు వారడం ప్రారంభమైంది. ఆ ఏడాదిలో 37శాతం ఉన్న ఓటు షేరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ హవాను ఎలా అడ్డుకోవాలో తెలియక లెఫ్ట్‌ సతమతమవుతోంది.
  • 2004లో లెఫ్ట్‌కు లోక్‌సభలో 59 మంది సభ్యులున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే సీపీఎం 26 సీట్లలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో లెఫ్ట్‌ మొత్తం 35 సీట్లను గెలుచుకుంది. పార్టీ నేత సోమనాథ్‌ ఛటర్జీ స్పీకరుగా ఎన్నికయ్యారు. యూపీఏకు లెఫ్ట్‌ అప్పట్లో మద్దతిచ్చింది. మన్మోహన్‌ ప్రధాని అయ్యారు.

క్షేత్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాలు

  • తృణమూల్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను భాజపా సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.
  • మమత అవకాశ వాదంపట్ల ఉత్తర బెంగాల్‌, జల్పాయ్‌గురి, దార్జీలింగ్‌ ప్రాంతాల్లోని ప్రజలు విరక్తిగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె రాష్ట్ర విభజన కోరుతున్న గూర్ఖా జనముఖి మోర్చాతో జట్టు కట్టారు. 
  • శిలిగుడి, ఉత్తర బెంగాల్‌లోని మాల్దాల్లో జరిగిన మమత ర్యాలీలు విజయవంతం కాలేదు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌గానీ, భాజపాగానీ బలం పుంజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
  • బీర్‌భుమ్‌ లాంటి జిల్లాల్లో భాజపాకు మద్దతు పెరుగుతోంది. మమత ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది.
  • బీర్‌భుమ్‌, బోల్‌పుర్‌ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో భాజపా 5 లక్షలకుపైగా ఓట్లను సాధించింది.

ఈ ఎన్నికలు ముఖ్యమే

పలు సర్వేల్లో భాజపాదే పైచేయి అని వెల్లడి కావడం మమతకు కాస్త ఇబ్బందికరమే. అందునా ఆమెకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. 2019లో భాజపా 18 సీట్లను గెలుచుకుంది. కానీ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. ఈసారి భాజపా 22 నుంచి 25 సీట్లు గెలుచుకుంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు ఇబ్బందులు తప్పవు.


సీఏఏ

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని మార్చి 11న మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది. ఇందులో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీలు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. ముస్లింలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. బెంగాల్‌లో ఉన్న హిందూ వర్గానికి చెందిన మతువాలకు భారీ ఎత్తున పౌరసత్వం లభించనుంది. వారంతా తమకు మద్దతు పలుకుతారని భాజపా ఆశిస్తోంది. వారు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు.


ముఖ్యమైన నియోజకవర్గాలు

  • డైమండ్‌ హార్బర్‌లో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పోటీ చేస్తున్నారు.
  • అసన్‌సోల్‌లో బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హా బరిలో ఉన్నారు.
  • తమ్‌లుక్‌లో భాజపా తరఫున స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ అభిజీత్‌ బెనర్జీ తలపడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని