భాజపా మూడోసారా.. కాంగ్రెస్‌ ఖాతా తెరవడమా?

లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌పై కాషాయ జెండా మరోసారి రెపరెపలాడి భాజపా హ్యాట్రిక్‌ కొట్టనుందా.. కాంగ్రెస్‌ పార్టీ దానిని నిలువరించి ఖాతా తెరవనుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 11 Apr 2024 06:29 IST

రాజస్థాన్‌లో కీలక పోరు
గత 2 ఎన్నికల్లో కమలం క్లీన్‌స్వీప్‌
జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ

లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌పై కాషాయ జెండా మరోసారి రెపరెపలాడి భాజపా హ్యాట్రిక్‌ కొట్టనుందా.. కాంగ్రెస్‌ పార్టీ దానిని నిలువరించి ఖాతా తెరవనుందా.. అనేది ఆసక్తికరంగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ భాజపా గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలిసారి గెలిచినప్పుడు రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి మాత్రం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అప్పుడు అశోక్‌ గహ్లోత్‌ సీఎంగా ఉన్నారు.

5 లక్షల మెజారిటీ లక్ష్యంగా..

రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 5 లక్షల మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో భాజపా ప్రచారానికి దిగింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ క్రియాశీలంగా ప్రచారం చేస్తూ హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేసి లక్షల ఓట్ల మెజారిటీని అందించాలని కోరుతున్నారు.

పోటీకి కాంగ్రెస్‌ సీనియర్ల విముఖత

పోటీ దగ్గరే కాంగ్రెస్‌లో నిస్తేజం ఆవరించినట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీనియర్లంతా ముఖం చాటేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వారంతా దూరం జరిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మొదలు

గత ఏడాది ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత భాజపాలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా దాదాపు 8,000 మంది నేతలు కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ముఖాముఖి పోరే

రాజస్థాన్‌లో దాదాపుగా ముఖాముఖి పోరే నెలకొంది. భాజపా, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, హనుమాన్‌ బేణీవాల్‌ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) ఉన్నా నామమాత్రమే. నాగౌర్‌లో బేణీవాల్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థిని నిలపలేదు.

బాంస్‌వాఢా-దుంగార్‌పుర్‌లో భారతీయ ఆదివాసీ పార్టీకి (బీఏపీ) కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. ఇక్కడ బీఏపీ తరఫున రాజ్‌ కుమార్‌ రోత్‌, భాజపా తరఫున రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్‌ మాలవీయ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ రెబల్‌గా అర్వింద్‌ దామోర్‌ పోటీ చేస్తున్నారు. ఆయనతో నామినేషన్‌ ఉపసంహరింపజేయాలనే పార్టీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్‌ గుర్తు లభించింది. ఉపసంహరణ సమయానికి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీని వెనుక భాజపా హస్తముందనే ఆరోపణలొచ్చాయి.


5 చోట్ల గట్టి పోటీ

రాష్ట్రంలోని 25 స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. చురు, ఝుంఝునూ, కరౌలీ-ధౌల్‌పుర్‌, టోంక్‌-సవాయీ మాధోపుర్‌, బాడ్‌మేర్‌లలో కాంగ్రెస్‌ పోరాడుతోంది.

చురులో రెండు సార్లు గెలిచిన రాహుల్‌ కాస్వాను ఈ సారి భాజపా తప్పించింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. రాహుల్‌ తండ్రి రాంసింగ్‌ కాస్వా అంతకుముందు రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని