గిరిపుత్రులు కరుణించేదెవరిని?

తరతరాలుగా కొండ కోనల్లో నివసిస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, దీర్ఘకాలంగా వారికి జరుగుతున్న అన్యాయాలను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం ‘అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ)-2006’ను తీసుకొచ్చింది.

Updated : 11 Apr 2024 06:25 IST

అటవీ హక్కుల అమలే 153 స్థానాల్లో కీలకాంశం

దిల్లీ: తరతరాలుగా కొండ కోనల్లో నివసిస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, దీర్ఘకాలంగా వారికి జరుగుతున్న అన్యాయాలను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం ‘అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ)-2006’ను తీసుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో దాని అమలు సరిగా జరగడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌ఏ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా 153 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. దాని అమలు ప్రధాన చర్చనీయాంశంగా ఉండటమే అందుకు కారణం.

అత్యధికం భాజపా ఖాతాలో..

‘వసుంధర’ అనే స్వతంత్ర సంస్థ విశ్లేషణ ప్రకారం- ఎఫ్‌ఆర్‌ఏ అమలు కీలకాంశంగా ఉన్న 153 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 103 స్థానాలు భాజపా ఖాతాలో ఉన్నాయి. ఈ జాబితాలోని సీట్లను 2019లో కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌ 11 చొప్పున గెల్చుకున్నాయి. శివసేన (6 సీట్లు), భారాస (5), వైకాపా (5), ఎన్సీపీ (4) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా ఈ 153 స్థానాల్లో 86 చోట్ల.. అటవీ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఓటర్లు 30%పైగా ఉన్నారు. 45 సీట్లలోనైతే అలాంటివారు ఏకంగా 40%పైగా ఉండటం గమనార్హం. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా మరోసారి బరిలో దిగుతున్న ఖుంటీ (ఝార్ఖండ్‌) నియోజకవర్గం అందులో ఒకటి.

ఎస్టీ రిజర్వుడు సీట్లలో ఇలా..

దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వుడు లోక్‌సభ సీట్లు 47 ఉన్నాయి. అయిదేళ్ల కిందట వాటిలో 31 చోట్ల భాజపా జయభేరి మోగించింది. కాంగ్రెస్‌ కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఎఫ్‌ఆర్‌ఏ అమలు కీలకాంశంగా ఉన్నవాటిలో 74 చోట్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడ్డాయి. వాటిలో హస్తం పార్టీ కేవలం అయిదింటిని గెల్చుకోగలిగింది.

హక్కుల చుట్టూ ప్రచారం

ఎఫ్‌ఆర్‌ఏ అమలు ప్రధాన డిమాండ్‌లలో ఒకటిగా ఉన్న 153 స్థానాల్లో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. గిరిజన హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటిస్తున్నాయి. మరోవైపు- ఎఫ్‌ఆర్‌ఏను సమర్థంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వారి వినతుల్లో మరికొన్ని..

  • తమ గ్రామసభలకు మరింత సాధికారత కల్పించాలి.
  • అటవీ భూములపై హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడాన్ని మానుకోవాలి.
  • అటవీ భూముల నుంచి స్థానికులను ఖాళీ చేయించే ముప్పును తగ్గించాలి.
  • పెసా చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి.
  • గిరిజనులపై అన్యాయంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.
  • మైనర్‌ అటవీ ఉత్పత్తులకు మెరుగైన ధరలు దక్కేలా చూడాలి.

క్లెయిముల పరిష్కారంలో తగ్గిన వేగం

అటవీ భూములపై హక్కుల మంజూరు కోరుతూ దాఖలైన క్లెయిముల పరిష్కార రేటు గత అయిదేళ్లలో 87.72% నుంచి 84.44%కు తగ్గింది. అయిదేళ్లలో మొత్తం 7.88 లక్షల కొత్త క్లెయిములు దాఖలవగా, వాటిలో 5.21 లక్షల క్లెయిముల్లో దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరింది. 5,827 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో క్లెయిముల తిరస్కరణ రేటు 97.23%గా ఉంది. సంఖ్యాపరంగా చూస్తే ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక క్లెయిములకు తిరస్కృతి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలు, అడవుల్లో నివసించే మరికొన్ని ఇతర వర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీవైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని