దేశం వీడేది నేను కాదు.. వాళ్లే!

లోక్‌సభ ఎన్నికల తర్వాత అవినీతి, కుటుంబ రాజకీయాలు, డ్రగ్స్‌, డీఎంకే సంరక్షిస్తున్న దేశద్రోహులు భారత్‌ వదిలిపెట్టి వెళ్లడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 11 Apr 2024 06:16 IST

తమిళనాడు సభల్లో ప్రధాని మోదీ
డీఎంకే అవినీతికి పర్యాయపదమని విమర్శ

ఈనాడు, చెన్నై: లోక్‌సభ ఎన్నికల తర్వాత అవినీతి, కుటుంబ రాజకీయాలు, డ్రగ్స్‌, డీఎంకే సంరక్షిస్తున్న దేశద్రోహులు భారత్‌ వదిలిపెట్టి వెళ్లడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తమిళనాడులోని వేలూరు, నీలగిరి పరిధిలోని మెట్టుపాళయం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘డీఎంకేలో ఓ పెద్ద నాయకుడు అన్నారు.. ఈ ఎన్నికలయ్యాక మోదీ భారత్‌ను వదిలేస్తారని. కాస్త చెవులు పెట్టి వినండి.. ఎన్నికలయ్యాక అవినీతి భారత్‌ను వదిలిపోతుంది. కుటుంబ రాజకీయాలు చేసేవారు, డీఎంకే సంరక్షించే దేశ విరోధులు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లాలి’’ అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే సభ్యులు అహంకార భాషతో మాట్లాడారని, అది తమిళ సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. సర్కారు దస్త్రాల ద్వారానే ‘కచ్చతీవు’ దీవి అంశం బయటపడిందని, 1974 నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తమిళనాడులోని ఈ భూభాగాన్ని శ్రీలంకకు ఇచ్చేసిందన్నారు. దాని పర్యవసానాలు పేద మత్స్యకారులు అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, డీఎంకే ఇటు తమిళనాడుకు, అటు దేశానికి అన్యాయం చేశాయన్నారు. విద్వేషం, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న డీఎంకే అవినీతికి పర్యాయపదంగా మారిందని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆ పార్టీకి ఎటువంటి పట్టింపు లేదన్నారు. అవినీతిపై మొదటి కాపీరైటు డీఎంకేదేనని, ఈ కుటుంబ కంపెనీ మొత్తం తమిళనాడును దోచుకుంటోందని విమర్శించారు. నేడు దేశం 5జీ టెలీ కమ్యూనికేషనులో ప్రపంచ రికార్డు సృష్టిస్తుంటే, డీఎంకే 2జీ కుంభకోణంతో దేశానికి చెడ్డపేరు తెచ్చిందన్నారు. మహిళలంటే గౌరవం లేని డీఎంకే ‘అమ్మ’ జయలలితను ఆమె బతికుండగా ఎలా అవమానించిందో అందరికీ తెలుసని చెప్పారు. ఈ పాపాలన్నీ లెక్కకట్టి ఏప్రిల్‌ 19న పోలింగు రోజున తేల్చాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.

అంబేడ్కర్‌ ఆత్మ నన్ను ఆశీర్వదిస్తుంది

నాగ్‌పుర్‌, లఖ్‌నవూ: కేంద్రంలో మోదీ సర్కారు మళ్లీ ఏర్పడితే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయన్న విపక్షాల విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లా కన్హాన్‌ పట్టణ ఎన్నికల ర్యాలీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్‌ 370ను రద్దు చేసినందుకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆత్మ తనను ఆశీర్వదిస్తుందని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో (1975 - 77) ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా? అని విపక్షాలను నిలదీశారు. ‘ఇండియా’ కూటమి బలపడితే దేశాన్ని విభజిస్తుందని ఓటర్లను హెచ్చరించారు. ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ భాజపా సారథ్యంలోని ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయని ప్రధాని అన్నారు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం జరగాల్సిన ప్రధాని రోడ్‌షో వాయిదా పడినట్లు ఆ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి గోవింద్‌ నారాయణ్‌ శుక్లా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని