బలియా నుంచి మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి 3 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 9 మంది అభ్యర్థులతో 10వ జాబితాను భాజపా బుధవారం విడుదల చేసింది.

Updated : 11 Apr 2024 06:11 IST

9 మందితో భాజపా పదో జాబితా
డింపుల్‌ యాదవ్‌పై ఎమ్మెల్యే పోటీ
రీటా బహుగుణ జోషికి మొండిచెయ్యి

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి 3 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 9 మంది అభ్యర్థులతో 10వ జాబితాను భాజపా బుధవారం విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు; పశ్చిమబెంగాల్‌, చండీగఢ్‌ల నుంచి ఒక్కో స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. యూపీలోని బలియా నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీని పక్కనపెట్టి మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ శేఖర్‌ను బరిలో దింపింది. ఇక్కడినుంచి చంద్రశేఖర్‌ ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం 2008లో ఉపఎన్నికలో నీరజ్‌శేఖర్‌ తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో మరోసారి గెలుపొందారు. 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి, ఆ పదవికి రాజీనామా చేసి 2020లో భాజపా తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు.

సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ పోటీచేసే మైన్‌పురీ లోక్‌సభ స్థానంలో ఆమెకు పోటీగా బరౌలీ ఎమ్మెల్యే జైవీర్‌ సింగ్‌ ఠాకుర్‌ను భాజపా అధిష్ఠానం రంగంలో దించింది. ఆ రాష్ట్రంలోని కౌశాంబీ (ఎస్సీ) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌సోంకర్‌కి మరోసారి అవకాశం ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని నైతిక హక్కుల కమిటీయే తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వ రద్దుకు సిఫార్సు చేసింది. అలహాబాద్‌ నుంచి రీటా బహుగుణ జోషీని తప్పించి బిహార్‌ మాజీ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి తనయుడు నీరజ్‌ త్రిపాఠిని రంగంలోకి దించారు. యూపీ నుంచి ప్రకటించిన ఏడు స్థానాల్లో ఐదుచోట్ల సిట్టింగులు ఉండగా అందులో ముగ్గుర్ని మార్చారు.

కిరణ్‌ఖేర్‌ స్థానంలో టాండన్‌

చండీగఢ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సతీమణి, సిట్టింగ్‌ ఎంపీ కిరణ్‌ఖేర్‌ను అనారోగ్య కారణాల రీత్యా తప్పించి కేంద్రపాలిత ప్రాంత భాజపా అధ్యక్షుడు సంజయ్‌ టాండన్‌కు అవకాశం ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లోని బర్దమాన్‌ దుర్గాపుర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ ఎంపీ ఎస్‌.ఎస్‌.అహ్లువాలియాను తాజాగా అసన్‌సోల్‌లో టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాపై పోటీకి నిలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని