కన్నడిగుల కనికరమెవరికి?

కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది.

Updated : 12 Apr 2024 06:16 IST

భాజపా దూకుడుకు కళ్లెం పడేనా..
సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్‌
ఇరుపక్షాల మధ్య మహా సమరం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది. అదే సమయంలో ఆ అవకాశమే ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలని కమలనాథులు- దళపతులు పోరాడుతున్నారు. గత 5 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండంకెల స్థానాల్లో గెలిచింది లేదు. 1999 ఎన్నికల్లో సాధించిన 18 స్థానాలే 25 ఏళ్లుగా కాంగ్రెస్‌ అందుకున్న అతి పెద్ద విజయం. 1984లో తొలిసారిగా లోక్‌సభకు భాజపా పోటీ చేసినా 1991 ఎన్నికల్లోనే ఖాతా తెరిచింది. ఆ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన భాజపా.. కాంగ్రెస్‌ తర్వాత అత్యధిక ఓట్లను కొల్లగొట్టిన పార్టీగా అవతరించింది. అప్పటి నుంచి భాజపా రాష్ట్రంలో అటు కాంగ్రెస్‌ను, ఇటు జనతాదళ్‌ల ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ 2019 నాటికి అత్యధిక స్థానాల్లో (25) విజయంతో రికార్డు సృష్టించింది. ఈసారి ఇదే మార్కు విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న కమల దళానికి కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.


కలిసొచ్చిన పొత్తు..

భాజపాకు రాష్ట్రంలో జనతాదళ్‌తో పొత్తు ఎంతగానో కలిసొచ్చే అంశం. 1997లో జనతాదళ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీగా ఏర్పడిన లోక్‌శక్తితో చేయి కలిపిన భాజపా 1998 ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పొత్తు కారణంగా భాజపా రాష్ట్రంలో తొలిసారిగా రెండంకెల స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 18 చోట్ల, లోక్‌శక్తి 10 చోట్ల పోటీ చేయగా భాజపా అత్యధికంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఆపై 1999 ఎన్నికల్లో జేడీయూతో కలిసి 7 స్థానాల్లో, 2004లో ఇదే పార్టీతో కలిసి 18 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా 19, 17, 25 స్థానాల్లో గెలిచిన భాజపాకు ఇన్నేళ్లకు పొత్తు అవసరం ఏర్పడింది. అదీ కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగానే. జనతాదళ్‌ నుంచి విడిపోయి మాజీ ప్రధాన మంత్రి హెచ్‌.డి.దేవెగౌడ నేతృత్వంలో ఏర్పడిన జేడీఎస్‌తో తొలిసారిగా భాజపా చేయి కలిపింది. ఈ ఎన్నికల్లో భాజపా 25 చోట్ల, జేడీఎస్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి.


గట్టి వ్యూహంతో భాజపా

2019 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.36 శాతాన్ని భాజపా రాబట్టుకుంది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన 51.6 శాతం ఓట్ల శాతం తర్వాత ఇదే అత్యధికం. 2024 ఎన్నికలను ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదంతో ఎదుర్కొంటున్న భాజపాకు కర్ణాటకలో సాధించే స్థానాలు ఎంతో కీలకం. 2019 ఎన్నికల్లో దక్షిణాది 5 రాష్ట్రాల్లో కేవలం 35 స్థానాల్లోనే గెలిచిన భాజపా ఈసారి వాటి సంఖ్యను 50కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్కులో కనీసం సగం స్థానాలను సాధించే అవకాశం ఒక్క కర్ణాటక నుంచే సాధ్యం. ఇందు కోసం గతంలో సాధించిన ఓట్ల శాతాన్ని 60కి చేరుస్తూ గత స్థానాలను యథావిధిగా కొల్లగొట్టాలని భాజపా అధిష్ఠానం రాష్ట్ర శ్రేణులను ఆదేశించింది. అయితే ఈసారి 25 స్థానాల మార్కు సాధించడం అనుకున్నంత సులువు కాదని రాష్ట్ర నాయకులు దిల్లీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు కారణం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా బలహీనంగా లేదు. గత విధానసభ ఎన్నికల్లో 135 స్థానాలతో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది. పైగా.. ఆ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తిరుగులేని నాయకత్వాన్ని అందిస్తున్నారు. వీరిని ఎదుర్కొని 25 స్థానాలను అందుకోవాలంటే పొత్తు తప్పదని భాజపా నిర్ణయించింది.


వైభవం కోసం..

1999 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్‌ మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మొదలైన నాటి నుంచి పొత్తుల కోసం ఏనాడూ కన్నెత్తి చూడని కాంగ్రెస్‌ 2019లో అనివార్యంగా జేడీఎస్‌తో చేయి కలిపింది. ఆ ఎన్నికల్లో చరిత్రలో చూడని పరాభవాన్ని ఎదుర్కొంది. జేడీఎస్‌కు 9 స్థానాలిచ్చిన కాంగ్రెస్‌ 19 చోట్ల పోటీ చేసి ఒకే ఒక స్థానంలో గెలవగలిగింది. తాజా విధాన సభలో సాధించిన ఘన విజయం నుంచి ఈ పరాభవాన్ని మరచిపోయినా పార్టీకి జాతీయ స్థాయిలో మళ్లీ పట్టు సాధించి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. అందు కోసం ఈసారి యువకులు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 40 ఏళ్లలోపు వారు 10 మంది, డిగ్రీ ఆపై విద్యార్హతలున్నవారు 12 మంది బరిలో దిగగా.. మహిళలకు ఆరు టికెట్లు కేటాయించింది.


భాజపా బలం

మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగ ఓట్లను జేడీఎస్‌ సహకారంతో రాబట్టే అవకాశం. విధానసభ ఎన్నికల సమయంలో దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు మళ్లీ బాధ్యతలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం.
బలహీనతలు: రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, 12మంది సిట్టింగ్‌లకు టికెట్‌ ఇవ్వకపోవడం. తిరుగుబాటు అభ్యర్థులు. కేఎస్‌.ఈశ్వరప్ప, సి.టి.రవి, అనంతకుమార్‌ హెగ్డే, డి.వి.సదానందగౌడ వంటి సీనియర్ల నుంచి అసమ్మతి. జేడీఎస్‌తో పొత్తు కారణంగా అహింద ఓట్లకు దూరమయ్యే ప్రమాదం.


కాంగ్రెస్‌ బలం

అధికారంలో ఉండడం, ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం. 135 నియోజకవర్గాల్లో బలమైన కార్యకర్తల మద్దతు. భాజపాతో జేడీఎస్‌ పొత్తు కారణంగా అహింద (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) ఓట్లను గుంపగుత్తగా సాధించే అవకాశం. కీలకమైన సమూహాలకు నాయకత్వం. యువతరం. వారసులకు టికెట్లు కేటాయించడం.

బలహీనతలు: జిల్లాల ఫలితాలను శాసించే నేతల అసమ్మతి. జాతీయ నాయకత్వంపై విశ్వసనీయత లేకపోవడం. ఈ ఎన్నికల తర్వాత గ్యారంటీలు తొలగిస్తారన్న ప్రచారం. రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ అంశాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని