వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశం.. అడ్డుకున్న జనసేన నాయకులు

వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

Updated : 12 Apr 2024 09:12 IST

కాకినాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని కాకినాడ అర్బన్‌ ప్రాంతం 2వ డివిజన్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఈ రహస్య సమావేశం జరిగింది. 2వ డివిజన్‌ నాయకుడు గుత్తుల సూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమారు 30 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి పంతం నానాజీ, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేయడంతో వైకాపా నాయకుడు సూర్యప్రకాష్‌తో సహా అందరూ పారిపోయారు. ఆరుగురు వాలంటీర్లు మాత్రమే మిగిలారు. దీనిపై పంతం నానాజీ మాట్లాడుతూ.. వాలంటీర్లను వైకాపా నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కన్నబాబు వస్తున్నారంటూ సమావేశం ఏర్పాటుచేసి తాము రావడంతోనే పారిపోయారని చెప్పారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వెంకటపతిరాజు, సర్పవరం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ వాలంటీర్ల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలాఉంటే.. వాలంటీర్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒక వాలంటీరు పుట్టిన రోజు కారణంగా వేడుకలకు హాజరయ్యామని.. వైకాపా సమావేశం కాదని పేర్కొన్నారు.

పంతం నానాజీ తదితరులపై కేసు

ఈ ఘటనలో సర్పవరం పోలీసులు కాకినాడ గ్రామీణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ, మరికొందరు జనసేన నాయకులపై గురువారం కేసు నమోదు చేశారు. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో వాలంటీరుగా పనిచేసిన కొయ్యా దుర్గాభవాని స్నేహితులతో కలిసి ఉదయం 11 గంటలప్పుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో పంతం నానాజీ, ఇతర జనసేన నాయకులు వచ్చి దురుసుగా ప్రవర్తించి, తలుపు గొళ్లెం పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేశారని దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని