హాస్యపు గుళికలు.. యానిమేషన్‌ హంగులు.. సృజనాత్మకంగా పార్టీల రీల్స్‌, వీడియోలు

లోక్‌సభ ఎన్నికల్లో యానిమేషన్‌ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. యానిమేటెడ్‌ వీడియోలు, రీల్స్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉండడంతో వీటిని సృజనాత్మకంగా తయారు చేస్తున్నారు.

Updated : 12 Apr 2024 08:18 IST

సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షణలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో యానిమేషన్‌ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. యానిమేటెడ్‌ వీడియోలు, రీల్స్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉండడంతో వీటిని సృజనాత్మకంగా తయారు చేస్తున్నారు. యానిమేషన్‌ కోర్సులు చేసిన విద్యార్థులు, నిపుణులు వీటితో ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ఐటీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ విద్యార్థులు వందల సంఖ్యలో యానిమేటెడ్‌ వీడియోలను ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల కోసం రూపొందించారు. మరిన్ని వీడియోలను తయారుచేసి అందించబోతున్నారు.

ఆద్యంతం నవ్వుకునేలా..

యానిమేషన్‌ వీడియోలు, రీల్‌్్స ద్వారా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో రెండేళ్ల క్రితం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరించే భాజపా.. తన ప్రత్యర్థి పార్టీలపై యానిమేషన్‌ వీడియోలు, రీల్స్‌ ద్వారా ఒకవిధంగా దండయాత్ర కొనసాగించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలు యానిమేటెడ్‌ వీడియోలు,  రీల్స్‌ను వేల సంఖ్యలో తయారు చేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలాయి. ప్రతి యానిమేషన్‌ వీడియో, రీల్స్‌ను.. ఆద్యంతం నవ్వుకునేలా, తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని సమాచారం ఇచ్చేలా రూపొందించాయి. ఒక పార్టీ అభ్యర్థులను పురాణ పురుషుల్లో ఒకరిగా, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించడం, మరో వీడియోలో యువ ఓటర్లు మాట్లాడుకోవడం, వాటిని నేతలు విని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వంటి వాటిని రూపొందించారు.


ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌.. కృత్రిమ మేధ..

యానిమేటెడ్‌ వీడియోలు, రీల్స్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను, పరిధి మేరకు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. నేతల ఫొటోలు, వీడియోలను సేకరించి వాటికి స్కెచ్‌లు గీసి వినియోగిస్తున్నారు. కృత్రిమ మేధ లేదా డబ్బింగ్‌ కళాకారుల ద్వారా నేతల ప్రసంగాలను అనుసంధానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆదరణ బాగుండడంతో వినూత్నంగా వీడియోలు రూపొందిస్తున్నామని ఫ్రీలాన్స్‌ యానిమేటర్‌ హితేష్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా విభిన్నమైన అంశాలను ఎంచుకుని చిత్రీకరిస్తున్నామని, కొన్ని వీడియోలను రాజకీయ నాయకుల ప్రసంగాల నుంచి రూపొందిస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని