దక్షిణాది ఫలితాలపై భాజపా ఆశ మిథ్యే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతంలో గొప్ప ఫలితాలు సాధించాలనే భాజపా ఆశ నెరవేరడం కల్ల అని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పేర్కొన్నారు.

Updated : 12 Apr 2024 06:18 IST

కాంగ్రెస్‌ ఎంపీ థరూర్‌ వ్యాఖ్య

దిల్లీ/ తిరువనంతపురం: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతంలో గొప్ప ఫలితాలు సాధించాలనే భాజపా ఆశ నెరవేరడం కల్ల అని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పేర్కొన్నారు. ఉత్తర భారతంలో మత, సామాజికపరమైన అంతరాలను రెచ్చగొడుతూ భాజపా లబ్ది పొందుతోందనీ, ఆ పాచిక దక్షిణ భారతంలో పారదని పేర్కొన్నారు. భాజపా అభివృద్ధి (వికాస్‌) సాధిస్తామంటూ ఓట్లు అడుగుతోందనీ, అభివృద్ధిలో ఇప్పటికే ఎంతో ముందున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఆ నినాదం పనిచేయదని గురువారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్‌ తేల్చి చెప్పారు. హిందీ, హిందుత్వ, హిందుస్థాన్‌ ఆధిక్యం కోసం భాజపా అన్వేషణ దేశంలోని భిన్నత్వంలో ఏకత్వ లక్షణానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. లౌకికత్వం భారతదేశ డీఎన్‌ఏలో అంతర్భాగమని చాటారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామంటూ భాజపా ఎన్నికల్లో గెలవాలని చూస్తోందనీ, అయితే శ్రీరాముడి మీద ఆ పార్టీకి కాపీ హక్కులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాను కూడా రామ భక్తుడినేననీ, తన ఇంట పూజగదిలో రామునికి నిత్యార్చన చేస్తానని థరూర్‌ తెలిపారు. ఓటర్లు నిరుద్యోగం, ధరల పెరుగుదల, మత విద్వేషాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని