కొంగు చాచి అడుగుతున్నా.. న్యాయం చేయండి

‘నాలుగు రోజులుగా నేను వైయస్‌ఆర్‌ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు.

Updated : 13 Apr 2024 07:23 IST

ఆడబిడ్డలం పోరాడుతున్నాం..
ప్రజలకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గద్గద స్వరంతో పిలుపు
సభలను వైకాపా అడ్డుకున్నా భారీగా తరలివచ్చిన జనం

ఈనాడు, కడప: ‘నాలుగు రోజులుగా నేను వైయస్‌ఆర్‌ జిల్లాలో తిరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ భయపడి ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని మార్చితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. అంటే అవినాష్‌రెడ్డి హంతకుడని జగన్‌.. విశ్వసిస్తున్నట్లే కదా?’ అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రాత్రి పులివెందులలోని పూలంగళ్ల కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అభ్యర్థిని ఉంచినా.. మార్చినా ప్రజలకు మాత్రం సీఎం జగన్‌ సమాధానం మాత్రం చెప్పాల్సిందేనన్నారు. అయిదేళ్లుగా హంతకులను ఎందుకు కాపాడుతున్నారో వివరణ ఇవ్వాలన్నారు. వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఈ సభలకు ఎవరూ వెళ్లొద్దంటూ నేతలు చెప్పినా జనం స్వచ్ఛందంగా హాజరుకావడంతో పాటు భావోద్వేగంతో ఆమె చెప్పిన మాటలను ఎంతో ఒపిగ్గా విన్నారు. పులివెందుల గడ్డపై నిల్చుని ఆమె నేరుగా జగన్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు ‘ఈ పులివెందుల బిడ్డ కనీసం ఒక రాజధానిని కూడా కట్టలేకపోయారు. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇన్నాళ్లూ కోటలో నిద్రపోయారు. ఇప్పుడు కుంభకర్ణుడులా నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. అయిదేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అని దుయ్యబట్టారు. ‘వివేకా హత్య కేసులో సునీత ఎంతో బాధపడింది. చిన్నమ్మ బాగా నష్టపోయారు. చిన్నాన్న విషయంలో న్యాయం చేయకపోతే మనం ఎందుకని అనుకున్నా. న్యాయం వైపు నిలబడాలని పోరాడుతున్నా. హంతకులెవ్వరన్నది.. సీబీఐ స్పష్టంగా తేల్చింది. జగన్‌ అడ్డుపడడం వల్ల సీబీఐ సైతం అవినాష్‌రెడ్డిని ఏమీ చేయలేకపోయింది’ అని ఆమె నిప్పులు చెరిగారు.

పర్యటన అడ్డుకోడానికి వైకాపా యత్నం 

పులివెందుల నియోజకవర్గంలో షర్మిల, సునీతల పర్యటనను వైకాపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల సభలకు వెళ్లొద్దంటూ ప్రజలకు సూచనలు చేశారు. లింగాలలో షర్మిల ప్రసంగానికి అడ్డుతగిలి ‘జైజగన్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుని సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వైకాపా నేతలను ఉద్దేశించి షర్మిల మండిపడ్డారు. ‘మీరు ఎంతైనా అరుచుకోండి.. మాకేం అభ్యంతరం లేదంటూ’ ఆగ్రహం వ్యక్తంచేశారు.  లింగాల, సింహాద్రిపురం సభలో సునీత మాట్లాడుతూ.. పులివెందుల్లో జరిగే సభకు అవినాష్‌రెడ్డి వచ్చి తాను వివేకాను హత్య చేయలేదని ప్రజల మధ్య చెప్పాలని.. అప్పుడునిజమేమిటో తేలుతుందని అన్నారు.

షర్మిల భావోద్వేగ ప్రసంగం

పుట్టి పెరిగిన పులివెందులలో జరిగిన సభల్లో షర్మిల పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. వివేకా హత్యను ప్రస్తావించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను.. మీ బిడ్డను.. రాజన్న తరహాలో సేవ చేస్తా.. మీ గొంతును దిల్లీ దాకా వినిపిస్తా.. నన్ను ఆదరించండి’ అంటూ విన్నవించారు. ఇద్దరు ఆడబిడ్డల్ని చూడటానికి రహదారుల వెంట జనం బారులుతీరారు. పులివెందుల సభకు మహిళలు భారీగా తరలివచ్చారు. జనాన్ని నిఘా వర్గాలు చిత్రీకరించడం కనిపించింది.


‘కొంగు చాచి అడుగుతున్నా. వివేకా హత్య కేసులో న్యాయం చేయండి. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవైపు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ నిలబడింది.. మరోవైపు హంతకుడు పోటీలో ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది.. మరోవైపు అన్యాయం ఉంది. రాజన్న బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసులో నిందితుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలి. జగన్‌ పులివెందుల పులి కాదు.. పిల్లి. ప్రజలు అధికారం ఇస్తే.. అవినాష్‌రెడ్డిని రక్షించడానికే వినియోగించుకున్నారు. అన్నీ ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోమని వేడుకుంటున్నాం’ 

 పులివెందుల సభలో ప్రజలకు షర్మిల విజ్ఞప్తి


‘2019 మార్చి 15న నా తండ్రి హత్య జరిగింది. ఈ విషయంపై ఫోన్‌ రాగానే హైదరాబాద్‌ నుంచి బయలుదేరాం. కొంత సమయానికే మళ్లీ ఫోన్‌ వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పారు. పులివెందుల ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని చూడగా.. తల పగిలిపోయింది. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం కోరా. జగనన్న సీఎం అయ్యాక వెళ్లి కలిశా. సీఎంగా ఉండి.. దోషులకు శిక్ష వేయకపోతే తనకు అవమానమని చెప్పారు. అప్పుడు జగన్‌ను నమ్మాను. కాలం గడుస్తోంది. కేసు ఎటూ తేలలేదు. ఇంటి వారిపైనే అనుమానం ఉంది.. సీబీఐ విచారణ కోరదామని రెండోసారి జగనన్న దగ్గరకు వెళ్లా. సీబీఐ విచారణ కోరితే నాపై 12వ కేసు అవుతుంది. అవినాష్‌రెడ్డి భాజపాలో చేరిపోతాడట. ఇక ఆ మాటెత్తొద్దు అని జగనన్న అన్నారు. అందుకే నేను స్వయంగా వెళ్లి కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరాల్సి వచ్చింది’.

 వివేకా కుమార్తె సునీత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని