గ్యారంటీలపై ప్రచారం చేయండి

గ్యారంటీ హామీల అమలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం తన నివాసంలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారంపై ఆయన సమీక్ష జరిపారు.

Updated : 13 Apr 2024 06:32 IST

 

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్యారంటీ హామీల అమలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం తన నివాసంలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ నియోజకవర్గం కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉంది. ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రజలకు చెప్పాలని నేతలకు సీఎం సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా నడుస్తున్నాయని వాకబు చేశారు. రైతులకు మద్దతు ధర ఇప్పించేలా కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి ఎద్దడి ఉంటే సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభించాలని, నేతలంతా ఐక్యంగా పనిచేయాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడ.. ఎలా ప్రచారం జరుగుతోందని నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వారు ఆయనకు వివరించారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ జ్వరం వల్ల సమావేశానికి రాలేదని నేతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని