రాష్ట్రంలో గ్యారంటీ లేని నాయకుడు రేవంత్‌

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదని.. రాష్ట్రంలో గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని భాజపా శాసనసభా పక్ష ఉపనేత వెంకటరమణారెడ్డి విమర్శించారు.

Updated : 13 Apr 2024 06:29 IST

భాజపా శాసనసభా పక్ష ఉపనేత వెంకటరమణారెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదని.. రాష్ట్రంలో గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని భాజపా శాసనసభా పక్ష ఉపనేత వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఏమాత్రం మారలేదని, సీఎం పదవిలో ఉన్నా ఇంకా జడ్పీటీసీ సభ్యుడిలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం కేసీఆర్‌పై విమర్శలు చేయటం తప్పా.. వేసవిలో ప్రజలు, రైతుల తాగు, సాగునీటి కష్టాలు ఎలా తీర్చాలన్న ధ్యాస లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేస్తామన్న రూ.లక్ష పంట రుణమాఫీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన రూ.2లక్షలు రుణమాఫీని ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కామారెడ్డిలో ఓడిపోతానని గ్రహించే కొడంగల్‌కు వచ్చి.. గెలిస్తే తాను సీఎం అవుతానని, ఓట్లు వేయాలని అభ్యర్థించారని పేర్కొన్నారు. భారాస దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో భాజపా అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏవీఎల్‌ఎన్‌ రాజు, కన్వీనర్‌ పవన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని