భాజపాతో కాంగ్రెస్‌ చీకటి ఒప్పందం

‘బడేభాయ్‌.. ఛోటేభాయ్‌’ అనుకుంటూ మోదీ, రేవంత్‌రెడ్డి ఒక్కటయ్యారని.. భాజపాతో ఉన్న చీకటి ఒప్పందంతోనే కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 13 Apr 2024 06:28 IST

అందుకే కరీంనగర్‌ అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ

ఈనాడు-కరీంనగర్‌, రాంపూర్‌-న్యూస్‌టుడే: ‘బడేభాయ్‌.. ఛోటేభాయ్‌’ అనుకుంటూ మోదీ, రేవంత్‌రెడ్డి ఒక్కటయ్యారని.. భాజపాతో ఉన్న చీకటి ఒప్పందంతోనే కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ తరఫున బలహీన అభ్యర్థులను పోటీలో దింపి.. భాజపా అభ్యర్థుల విజయానికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి గోసను తీర్చాలని కేసీఆర్‌ అడిగితే.. ఆయన గురించి రేవంత్‌రెడ్డి అనుచితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన తీరు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుడిలా ఉందన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తే.. కాంగ్రెస్‌ సర్కారు నాలుగు నెలల్లోనే రోజు విడిచి రోజు అందిస్తోందని, కొన్నిసార్లు నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తోందని మండిపడ్డారు. రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. తనను నమ్మి ఓట్లేసిన అవ్వాతాతల గుండెలపై తన్నారని హరీశ్‌ ధ్వజమెత్తారు. అబద్ధాల హామీలతో పరిపాలనను కాంగ్రెస్‌ గాలికి వదిలేసిందన్నారు. జై తెలంగాణ అని ఎప్పుడూ అనని రేవంత్‌రెడ్డి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని హరీశ్‌రావు అన్నారు. జై తెలంగాణ అన్నవారిని కాల్చిచంపుతానంటూ కరీంనగర్‌కు తుపాకీ పట్టుకుని బయలుదేరిన ఆయన.. ఏ ఒక్కరోజూ అమరవీరులకు నివాళులు అర్పించలేదని విమర్శించారు. చావు నోట్లో కేసీఆర్‌ తలపెట్టి.. తెలంగాణ సాధించకపోతే.. ఇప్పుడు సీఎం కుర్చీలో రేవంత్‌రెడ్డి కూర్చునేవారేనా అని ప్రశ్నించారు. భారాసను దెబ్బతీయాలన్న కుట్రతో భాజపా, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే.. ఇచ్చిన హామీలేవీ నెరవేరవన్నారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. రోడ్‌షోలో భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని