పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమిటి

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగాలి తప్ప శ్రీరాముని పేరిట అక్షింతలు, కుంకుమ ప్రజలకిచ్చి ఓట్లడుగుతూ దేవుడ్ని రాజకీయాల్లోకి లాగడమేమిటని ప్రశ్నించారు.

Updated : 13 Apr 2024 06:27 IST

భాజపాకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు
మోదీ సర్కారు, భారాస ప్రభుత్వ వైఫల్యాలపై 14న కరీంనగర్‌లో దీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగాలి తప్ప శ్రీరాముని పేరిట అక్షింతలు, కుంకుమ ప్రజలకిచ్చి ఓట్లడుగుతూ దేవుడ్ని రాజకీయాల్లోకి లాగడమేమిటని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలో గత భారాస ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్‌లో దీక్ష చేపడతానని, మిగతా జిల్లాల్లోనూ దీక్షలు చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు మెట్టు సాయికుమార్‌, సామ రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి మంత్రి శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మోదీ తెలంగాణ ఏర్పాటును కించపరిచారు. అమరుల త్యాగాలను అవహేళన చేసి మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయలేదు. తెలంగాణకు చెందిన 7 మండలాలను, విద్యుత్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. భాజపా బీసీలు, దళితులకు వ్యతిరేకం. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏంచేశారు? పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయని భాజపా, భారాస నేతలు.. 4 నెలల మా ప్రభుత్వాన్ని పట్టుకొని హామీల అమలు గురించి ప్రశ్నించడం సిగ్గుచేటు. హరీశ్‌రావు.. గతంలో భారాస ప్రభుత్వం రూ.3,016 నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చినవారినే ఓట్లు అడగాలి. వర్షాభావ పరిస్థితులు భారాస అధికారంలో ఉన్నప్పుడే మొదలయ్యాయి. రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరి మీ హయాంలో కనీసం రూ.2,500 అయినా ఇచ్చారా? పంటనష్టంపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రండి. కేంద్రాన్ని పరిహారం అడుగుదాం’’ అని మంత్రి అన్నారు.

నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి..

నాయీ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చాలని, నాయీ బ్రాహ్మణులకు గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని