దూరాన ఉంటూ.. దగ్గరయ్యేందుకు!

లోక్‌సభ ఎన్నికల వేళ.. వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల టెలీ, డిజిటల్‌ ప్రచారం వేగం పెరిగింది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలందరినీ కలిసేందుకు వీల్లేకపోవడంతో ఈ తరహా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు.

Updated : 13 Apr 2024 06:26 IST

అభ్యర్థుల టెలీ, డిజిటల్‌ ప్రచారం
ఓటు వేయాలంటూ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు
సామాజిక మాధ్యమాల ద్వారా కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ.. వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల టెలీ, డిజిటల్‌ ప్రచారం వేగం పెరిగింది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలందరినీ కలిసేందుకు వీల్లేకపోవడంతో ఈ తరహా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘హలో నమస్కారం.. నేను మీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ పలుచోట్ల ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. అలాగే.. తాను ఫలానా పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ.. ఆ పార్టీ గురించి అభిప్రాయాలను అడగడంతో పాటు.. ‘మీ కుటుంబ సభ్యులందరూ మా పార్టీకే ఓటు వేయాలి’ అంటూ నేరుగా పార్టీ కార్యాలయాల నుంచి పలువురికి కాల్స్‌ వస్తున్నాయి. మరోవైపు ఇతర పార్టీల వైఫల్యాలు, లోపాలను ప్రస్తావిస్తూ.. ఆయా నాయకులు గతంలో, ఇప్పుడు మాట్లాడిన మాటలను విమర్శిస్తూ పలువురు అభ్యర్థులు డిజిటల్‌ ప్రచారం కూడా ప్రారంభించారు. మరోవైపు ఓటర్లకు మరింత దగ్గరయ్యేలా ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఉగాది, రంజాన్‌ శుభాకాంక్షలు కూడా చెప్పారు.

ఫోన్‌ నంబర్లు సేకరిస్తూ..

ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు, నాయకులు వివిధ మార్గాల్లో ఓటర్ల వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ఆయా నంబర్లకు నేరుగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు వెళ్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. ఒక్కో ఎస్‌ఎంఎస్‌ గరిష్ఠంగా ఇంగ్లిష్‌లో 160 పదాలు, తెలుగులో 70 పదాలు ఉండేలా ఖర్చు లెక్కలు చూపించి ప్రచారం చేసుకోవచ్చు. దీంతో అభ్యర్థులు ఎస్‌ఎంఎస్‌ ప్రచారాలను ప్రారంభించారు. వివిధ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కూడా అభ్యర్థులు, నాయకులు ప్రచార వేగాన్ని పెంచారు. సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగులపై వస్తున్న కామెంట్లకు ఇప్పటికే వివిధ పార్టీల సోషల్‌ మీడియా బృందాలు సమాధానాలు ఇస్తున్నాయి. మరికొన్ని ఖాతాల్లో పార్టీ అభిమానులు ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు, అభిమానులు వ్యక్తిగత ఖాతాల ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లో సోషల్‌ మీడియా గ్రూపులు విస్తృతమయ్యాయి. ఆయా గ్రూపుల్లోని సభ్యులుగా ఉన్న పార్టీ అనుచరుల ద్వారా ఓటర్ల ఫోన్‌ నంబర్లు తీసుకుని టెలీ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహాలో వివిధ పార్టీలకు ఆయా గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా ఓటర్ల ఫోన్‌ నంబర్ల వివరాలు చేరడంతో రోజుకి ఆయా పార్టీల అభ్యర్థుల నుంచి ఒక్కసారైనా కాల్‌ వస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల నుంచి.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నాయకుల నుంచీ ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు చెబుతున్నారు.


ఇతరులకు వెళ్తున్న కాల్స్‌..

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రచారం పలు నియోజకవర్గాల్లో గురి తప్పుతోంది. ఉదాహరణకు.. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లకు సికింద్రాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థుల ప్రచార కాల్స్‌ వెళ్తున్నాయి. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ ఓటరు కాకున్నా ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి కాల్స్‌ వస్తుండటం గమనార్హం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని