అంబేడ్కరైనా రాజ్యాంగాన్ని మార్చలేరు

బాబాసాహెబ్‌ అంబేడ్కరే వచ్చినా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాజ్యాంగమే తమకు సర్వస్వమని, ప్రభుత్వం దానిని ఎంతో గౌరవిస్తుందని చెప్పారు.

Updated : 13 Apr 2024 06:24 IST

మాకు అదే భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌
త్వరలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలు: మోదీ
కాంగ్రెస్‌ ఒక్క ప్రధాన సమస్యా తీర్చలేదు: మోదీ

ఉధంపుర్‌, జైపుర్‌, బాడ్‌మేడ్‌: బాబాసాహెబ్‌ అంబేడ్కరే వచ్చినా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాజ్యాంగమే తమకు సర్వస్వమని, ప్రభుత్వం దానిని ఎంతో గౌరవిస్తుందని చెప్పారు. అదే తమకు భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్‌, ఖురాన్‌ అని పేర్కొన్నారు. భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన రాజస్థాన్‌, కశ్మీర్‌లలో ఎన్నికల సభల్లో ప్రసంగించారు. రాజస్థాన్‌లోని దౌసాలో రోడ్‌షో నిర్వహించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై దశాబ్దాలపాటు వివక్ష చూపించిన కాంగ్రెస్‌ పార్టీ చివరకు అంబేడ్కర్‌నూ ఎన్నికల్లో ఓడించింది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని కూడా ఇవ్వలేదు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించి, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నించింది. ఇప్పుడు రాజ్యాంగం ముసుగులో నన్ను నిందించాలని చూస్తోంది. ఆ కూటమి అనేక అబద్ధాలు చెబుతోంది’’ అని రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌ సభలో చెప్పారు.

ఆ రోజెంతో దూరం లేదు

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం కట్టుబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజు ఎంతో దూరంలో లేదని మోదీ ప్రకటించారు. ప్రజలు తమ సమస్యల్ని మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నివేదించుకునే రోజు సమీపంలోనే ఉందని చెప్పారు.  కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే- మేం రద్దుచేసిన ఆర్టికల్‌ 370ను పునురుద్ధరిస్తామని చెప్పగలవా? అలాచెప్పి ప్రజల ముందుకు వెళ్లగలవా? అలాచేస్తే వాటి ముఖాన్నైనా దేశం చూడదు. ఆ అధికరణం పేరుతో ఓ గోడను సృష్టించింది కుటుంబ పార్టీలే. అది మాత్రమే ఇక్కడి ప్రజల్ని రక్షించగలదనే భ్రమను ఆ పార్టీలు కల్పించాయి. ఆ గోడను కూల్చడమే కాకుండా ఆ శిథిలాలను భూస్థాపితం చేశాను’ అని ఉధంపుర్‌ సభలో చెప్పారు.

ఇంతవరకు చూసింది ట్రైలరే

ఉగ్రవాద భయం, రాళ్లదాడులు వంటివి లేకుండా కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ఈసారి జరుగుతాయని ప్రధాని హామీ ఇచ్చారు. ఎన్నికల బహిష్కరణకు వేర్పాటువాదులు పిలుపు ఇవ్వడం గత చరిత్రేనని అన్నారు. ఇప్పటివరకు చేసిచూపిన అభివృద్ధి ఒక ట్రైలర్‌ మాత్రమేనని, తన ఆలోచనలు, దార్శనికత ఇంకా పెద్దగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే అభివృద్ధి విరోధి అని మోదీ పేర్కొన్నారు. 60 ఏళ్లకు పైగా దేశాన్ని ఆ పార్టీయే పాలించినా ప్రధాన సమస్యల్లో దేనినీ పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయిందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని