తెదేపాలో చేరిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా దంపతులు

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ వైకాపాకు రాజీనామా చేశారు.

Updated : 13 Apr 2024 06:34 IST

తాడికొండ అసెంబ్లీ సీటు ఆశించిన సురేష్‌కుమార్‌

గుంటూరు(జిల్లాపరిషత్తు), వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ రాశారు. బాపట్ల జిల్లా కొల్లూరు ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శుక్రవారం తెదేపాలో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రిస్టినా, సురేష్‌కుమార్‌లు రాజీనామా చేయడం ఆ పార్టీకి చుక్కెదురుగా భావిస్తున్నారు. రాజధాని ప్రాంతం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కత్తెర సురేష్‌కుమార్‌ 2023 డిసెంబరు వరకు వ్యవహరించారు. వైకాపా అధిష్ఠానం నియోజకవర్గాల సమన్వయకర్తలను డిసెంబరులో ప్రకటించినప్పుడు సురేష్‌కుమార్‌ స్థానంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేరును ప్రకటించింది. ఈ నిర్ణయం క్రిస్టినా, సురేష్‌కుమార్‌ దంపతులను తీవ్రంగా కలచివేసింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించగా శ్రీదేవి తీవ్రంగా విభేదించారు. ఆ తర్వాత మాణిక్యవరప్రసాద్‌ను తప్పించి ఆ స్థానంలో క్రిస్టినా భర్త సురేష్‌కుమార్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించారు.

దీంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారన్న అభియోగంతో ఎమ్మెల్యే శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి సురేష్‌కుమార్‌, క్రిస్టినా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పార్టీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి తెదేపాలో చేరడంతో తాడికొండ సీటు తనకే లభిస్తుందని భావించారు. అయితే ఆ టికెట్‌ను మేకతోటి సుచరితకు కేటాయించడంతో క్రిస్టినా, సురేష్‌కుమార్‌ దంపతులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాడికొండ అసెంబ్లీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టికెట్‌ ఇస్తామని, చివరికి ఎక్కడా టికెట్‌ కేటాయించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ని కలిసేందుకు పలుమార్లు అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తెదేపాలో చేరాక క్రిస్టినా మాట్లాడుతూ వైకాపాలో 12 ఏళ్లుగా రేయింబవళ్లు పార్టీ కోసం పనిచేశామని, గౌరవ మర్యాదలు లేని చోట ఇమడలేక, జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని సైతం వదులుకొని తెదేపాలో చేరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని