ఈశాన్య పవనమెటు?

ఈశాన్య రాష్ట్రాల్లోని 11 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక్కో పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలోని 25 సీట్లలో అస్సాంలోని 14 సీట్లను మినహాయిస్తే మిగిలిన వాటిలో ఓటర్ల నాడి అంతుచిక్కడం లేదు.

Updated : 13 Apr 2024 06:20 IST

ఈశాన్య రాష్ట్రాల్లోని 11 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక్కో పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలోని 25 సీట్లలో అస్సాంలోని 14 సీట్లను మినహాయిస్తే మిగిలిన వాటిలో ఓటర్ల నాడి అంతుచిక్కడం లేదు. అధికార పార్టీలకు అంత సులువుగా గెలుపు దక్కేలా కనిపించడం లేదు. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. కొన్నిచోట్ల భాజపా పైచేయి సాధిస్తోంది. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌, ప్రశాంతంగా ఉండే మేఘాలయ, గిరిజన హక్కుల పోరాటాల త్రిపుర, సరిహద్దుల్లో విదేశీ చొరబాట్ల అరుణాచల్‌ ప్రదేశ్‌,  స్వతంత్ర కౌన్సిల్‌ డిమాండ్ల నాగాలాండ్‌, కొత్త పార్టీ రాకతో రాజకీయాలు మారిన మిజోరం, రాజకీయ హక్కుల పోరాట సిక్కింలలో మొదటి, రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.


అధికార పార్టీకి సెగ!

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు తొలి, రెండో విడతల్లో పోలింగ్‌ జరగనుంది. మెజారిటీ వర్గమైన మైతేయ్‌లు, కొండ ప్రాంతాల్లో ఉండే కుకీల మధ్య ఘర్షణలతో రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఉంది. గత ఏడాది మే 3వ తేదీన ప్రారంభమైన ఘర్షణల్లో ఇప్పటిదాకా 200 మందికిపైగా మరణించారు. వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇన్నర్‌ మణిపుర్‌తోపాటు ఎస్టీ నియోజకవర్గమైన ఔటర్‌ మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మిగిలిన ప్రాంతంలో 26న పోలింగ్‌ జరుగుతుంది. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఓటేసేందుకు ఏర్పాట్లు చేసినా ఎంత మేర ఈ ప్రయత్నం సఫలమవుతుందనేది అనుమానమే. ఇంఫాల్‌ లోయలో బహిరంగ ప్రచారం చేయవద్దని మైతేయ్‌ మిలిటెంట్‌ గ్రూపు అరాంబాయీ తెంగేల్‌ తెగేసి చెప్పింది. ఇక కొండ ప్రాంతాల్లో కుకీ గ్రూపులు కొన్ని ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి.

  • కుకీ-జోమీ తెగ నుంచి ఏ నేతా పోటీ చేయకపోవడం మణిపుర్‌లో ఇదే తొలిసారి. ఔటర్‌ మణిపుర్‌ నియోజకవర్గంలో వారి సంఖ్య 3లక్షలకు పైగా ఉంటుంది.
  • భాజపా, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) కూటమి రెండు సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.
  • ఇన్నర్‌ మణిపుర్‌లో జేఎన్‌యూ ప్రొఫెసర్‌, అల్లర్లపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపించిన బిమోల్‌ అకోయీజామ్‌ను కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా నిలిపింది. ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. ఆయన మణిపుర్‌ విద్యాశాఖ మంత్రి, కూటమి అభ్యర్థి థౌనాఓజం బసంత్‌ కుమార్‌ సింగ్‌ను ఎదుర్కొంటున్నారు. 2019లో ఈ సీటును భాజపా గెలుచుకుంది.
  • ఔటర్‌ మణిపుర్‌లో గత ఎన్నికల్లో ఎన్‌పీఎఫ్‌ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్‌ నుంచి ఆల్ఫ్రెడ్‌ కన్నగం ఎస్‌ ఆర్థర్‌ పోటీ చేస్తున్నారు. ఆయనతో ఎన్‌పీఎఫ్‌ తరఫున కచొయ్‌ టిమోథి జమిక్‌ తలపడుతున్నారు.

ఎన్‌పీపీకి ఎదురుందా?

మేఘాలయలోని తుర, షిల్లాంగ్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 19వ తేదీనే పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ భాజపా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి జూనియర్‌ భాగస్వామిగానే ఉంది. ఇక్కడి రెండు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు చేసినవే. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రం క్రమంగా స్థానిక పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ఆధిపత్యం ప్రారంభమైంది.

  • 2019లో తుర సీటును ఎన్‌పీపీ గెలుచుకుంది. కన్రాడ్‌ తండ్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా 1977 నుంచి ఇక్కడ ఒక్కసారీ ఓడిపోలేదు. 2016లో ఆయన చనిపోయారు. ఆ తర్వాత నుంచి అగాథా సంగ్మా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి సాలెంగ్‌ ఎ సంగ్మా, ఎన్‌పీపీ నుంచి అగాథా సంగ్మా, తృణమూల్‌ నుంచి జెనిత్‌ సంగ్మా బరిలో ఉన్నారు.
  • షిల్లాంగ్‌లో ఎమ్మెల్యే అంపరీన్‌ లింగ్డోను ఈసారి ఎన్‌పీపీ బరిలో నిలిపింది. 2022లో ఆయన కాంగ్రెస్‌ నుంచి ఎన్‌పీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్‌ దిగ్గజం విన్సెంట్‌ పాలాతో తలపడుతున్నారు. 1998 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది.

‘జాతీయ’ పోరు

త్రిపురలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ 19, 26 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. ఎస్టీలకు కేటాయించిన త్రిపుర ఈస్ట్‌లో భాజపాతో జట్టు కట్టిన టిప్రా మోతా నుంచి అధినేత ప్రద్యోత్‌ దేబ్‌బర్మ సోదరి, రాజ కుటుంబానికి చెందిన కృతీసింగ్‌ దేబ్‌బర్మ బరిలో నిలిచారు. గ్రేటర్‌ టిప్రాలాండ్‌ కోసం టిప్రా మోతా పోరాడుతోంది. గత నెలలోనే మోదీ ప్రభుత్వం టిప్రా మోతా డిమాండ్లపై ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఇండియా కూటమిలోని సీపీఎం నుంచి రాజేంద్ర రియాంగ్‌ పోటీ చేస్తున్నారు. టిప్రా మోతాకు ఇదే తొలి లోక్‌సభ ఎన్నిక.

  • త్రిపుర వెస్ట్‌లో భాజపా నుంచి మాజీ సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆశిష్‌ కుమార్‌ సాహా బరిలో ఉన్నారు.
  • ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపురలో పదేళ్లుగా భాజపా ఆధిపత్యం చెలాయిస్తోంది.

భాజపాదే ఆధిపత్యం

చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 60 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ భాజపాదే ఆధిపత్యం. దీనికి రుజువుగానా అన్నట్లు ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరచూ చైనాతో వివాదాలు నెలకొనే ఈ ప్రాంతంలో జాతీయవాదం ప్రభావం చూపనుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ మాత్రం అభివృద్ధే తమను గెలిపిస్తుందని చెబుతున్నారు.

  • రెండు నియోజకవర్గాల్లో భాజపా నుంచి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, ఎంపీ తాపిర్‌ గావ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు.
  • కాంగ్రెస్‌ నుంచి నబం తుకి, బోసిరాం సిరం బరిలో ఉన్నారు.

సులభమా.. గట్టి పోటీయా..

క్రిస్టియన్‌ ఓటర్లు అధికంగా ఉండే నాగాలాండ్‌లోని ఒక సీటుకు 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థి టొఖెహో యెప్తోపీ 16,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ చిసీని ఓడించారు. ఈసారీ అదే తరహాలో గట్టి పోటీ ఉంటుందా.. సులభంగా ఎన్‌డీపీపీ గెలుస్తుందా.. కాంగ్రెస్‌ పట్టు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర ప్రాంతీయ కౌన్సిల్‌ ఏర్పాటుపై ఆలస్యం అంశం ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పు నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఎన్‌పీవో) ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తూర్పు ప్రాంతంలోని 6 జిల్లాల్లో ఈ సంస్థ ప్రభావం ఉంటుంది. నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేదు. 60 సీట్లున్న అసెంబ్లీలో నెఫ్యూ రియో ఆధ్వర్యంలోని ఎన్‌డీపీపీకి 25, ఆయనకు మద్దతిచ్చే భాజపాకు 12 సీట్లున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న మిగిలిన పార్టీలైన ఎన్సీపీ, ఎల్‌జేపీ, జేడీయూ, ఎన్‌పీఎఫ్‌, స్వతంత్రులు ఆయనకే మద్దతిస్తున్నారు.

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ నుంచి చుంబెన్‌ మర్రీ, కాంగ్రెస్‌ నుంచి ఎస్‌ఎస్‌ జమీర్‌ పోటీపడుతున్నారు.


బహుముఖ పోటీ

మిజోరంలోని ఒక లోక్‌సభ స్థానానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది. కొత్తగా ఏర్పాటై రాష్ట్రంలో అధికారం చేపట్టిన జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) తమ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త రిచర్డ్‌ వాన్‌లాల్‌హమంగ్‌యిహాను బరిలో దింపింది. ఈ పార్టీకి ఇదే తొలి లోక్‌సభ ఎన్నిక. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) నుంచి రాజ్యసభ సభ్యుడు వన్‌లాల్‌వేనా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ హోంశాఖ కార్యదర్శి లాల్‌బియాక్‌జామా తలపడుతున్నారు. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నుంచి మిజో సింగర్‌ రీటా మాల్‌స్వామి బరిలోకి దిగారు. 2019లో ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌ గెలిచింది. రాష్ట్రంలో భాజపాతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం ఎంఎన్‌ఎఫ్‌ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. జెడ్‌పీఎం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. అదే పరంపరను కొనసాగించాలని ఆ పార్టీ తీవ్రంగా పోరాడుతోంది. ఎంఎన్‌ఎఫ్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది.


ప్రాంతీయ ఆధిపత్యం

సిక్కింలోని ఒక లోక్‌సభ స్థానానికి, 32 అసెంబ్లీ సీట్లకు 19వ తేదీనే పోలింగ్‌ జరగనుంది. జాతీయ వాదం, అభివృద్ధి పేరుతో ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాలని భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీలదే ఇక్కడ హవా. 5 దశాబ్దాల కిందట భారత్‌లో విలీనమైనప్పటి నుంచి సిక్కింలో ప్రాంతీయ పార్టీలే అధికారం చెలాయిస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చాతో చర్చలు విఫలం కావడంతో భాజపా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు భాజపాకు దూరంగానే ఉన్నాయి. స్థానిక తెగల సామాజిక-సాంస్కృతిక, రాజకీయ హక్కులు ప్రభావితం అవుతాయన్న భయమే వారిని భాజపాకు దూరం చేసింది. క్రిస్టియన్లు, బౌద్ధులు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో స్థానిక తెగల హక్కులను గుర్తించే ‘సిక్కిమీస్‌’ను విస్తరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో ఇప్పటివరకూ లేప్చా, భూటియా, నేపాలీ వర్గాలే ఉండేవి. కొత్తగా తెచ్చిన చట్టంతో 1975కు ముందు సిక్కింలో ఉన్నవారి వారసులు సిక్కిమీస్‌ పరిధిలోకి వస్తారు. ఇది కేవలం ఆదాయపు పన్ను మినహాయింపు కోసమే అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా స్థానికులు విశ్వసించడం లేదు. ఈ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అయ్యే అవకాశముంది. భాజపా ఇప్పటివరకూ ఈ రాష్ట్రంలో విజయం సాధించలేదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

సిక్కిం లోక్‌సభ నియోజకవర్గంలో సిక్కిం క్రాంతికారీ మోర్చా నుంచి సిటింగ్‌ ఎంపీ ఇంద్ర హంగ్‌ సుబ్బ బరిలో నిలిచారు. మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ నుంచి పీడీ రాయ్‌, కాంగ్రెస్‌ నుంచి గోపాల్‌ ఛెత్రి, భాజపా నుంచి దినేశ్‌ చంద్ర నేపాల్‌ పోటీ చేస్తున్నారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని