నారీ శక్తి చూపుతారా?

కన్నడనాట ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది.

Updated : 13 Apr 2024 06:19 IST

కర్ణాటక బరిలో నిలిచిన పలువురు మహిళలు

కన్నడనాట ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. వీరిలోనూ 99 శాతం మంది స్వతంత్య్ర అభ్యర్థులుంటారు. ప్రముఖ పార్టీలన్నీ కలిపి ఒక్కశాతం టికెట్లు కూడా మహిళలకు కేటాయించవు. ఈ కారణంగా ఏటేటా కర్ణాటక నుంచి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళా ఎంపీల సంఖ్య ఒకటి లేదంటే అదీ ఉండని పరిస్థితి. కానీ ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళల సంఖ్య కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలకు టికెట్లు ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళల సంఖ్యలో ఇదే అత్యధికం.

కాంగ్రెస్‌లో జోరు..

ఏడాది కిందటే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన మేరకు ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసింది. ఈ ఐదింటిలో రెండు కేవలం మహిళల కోసం రూపొందించినవే. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ‘శక్తి’, ప్రతి గృహిణికి రూ.2వేల ఆర్థిక సాయం అందించే ‘గృహలక్ష్మి’.. ఈ రెండు పథకాలు ప్రస్తుతం రాష్ట్రంలో సజావుగానే అమలవుతున్నాయి. మహిళలను కేవలం లబ్ధిదారులుగానే చూడకుండా రాజకీయాల్లోనూ వారికి అవకాశాలు సృష్టిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఏడాదిగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. రాజకీయ పార్టీల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇంత మంది మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. పోటీ చేస్తున్న ఆరుగురిలో సంయుక్తా పాటిల్‌, ప్రియాంకా జార్ఖిహొళి, సౌమ్యా రెడ్డి మంత్రుల వారసులు. వీరంతా యువతరానికి ప్రతినిధులు. వీరిలో సంయుక్త పొరుగు నియోజకవర్గంలో పోటీ చేయడంవల్ల స్థానిక నేతల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. శివమొగ్గ నుంచి పోటీ పడుతున్న గీతా శివరాజ్‌ కుమార్‌ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమార్తె, కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ సతీమణి. దావణగెరె నుంచి పోటీ చేస్తున్న ప్రభా మల్లికార్జున్‌ రాష్ట్రంలో అతి పెద్ద వయసున్న ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప కోడలు. ఆమె భర్త మల్లికార్జున్‌ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. ఉత్తర కన్నడ నుంచి పోటీ చేస్తున్న అంజలి నింబాళ్కర్‌ ఐఏఎస్‌ అధికారి హేమంత్‌ నింబాళ్కర్‌ భార్య. ఆమె గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే పార్టీ అత్యధికంగా ముగ్గురికి టికెట్‌ ఇచ్చింది. 2019 ఎన్నికలో కేవలం ఓ మహిళకు టికెట్‌ ఇచ్చింది.

భాజపా నుంచి ఇద్దరే..

కాంగ్రెస్‌తో పోలిస్తే భాజపా నుంచి తక్కువ మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికే టికెట్‌ ఇచ్చిన భాజపా ఈసారి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ప్రస్తుతం బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉడుపి-చిక్కమగళూరు నుంచి భాజపా కార్యకర్తలు, నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవడంతో అధిష్ఠానం ఆమె నియోజకవర్గాన్ని మార్చింది. ఆమె వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు ఆప్తుల్లో ఒకరిగా పేరున్న శోభా కరంద్లాజెకు టికెట్‌ ఇవ్వడంపై పలువురు సీనియర్లు విమర్శలకు దిగడం గమనార్హం. దావణగెరె నుంచి పోటీ చేస్తున్న గాయత్రి భర్త జీఎం.సిద్ధేశ్వర్‌ ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి ఎంపీ. ఆయనను తప్పించి భార్యకు టికెట్‌ ఇవ్వడంపైనా స్థానిక భాజపా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భాజపాతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్‌ కేవలం మూడు చోట్ల పోటీ చేస్తుండగా ఈ మూడింటిలో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. 2019లో ఓ మహిళకు జేడీఎస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చినా.. విజయం దక్కలేదు.


కాంగ్రెస్‌ అభ్యర్థులు

 • సంయుక్తా పాటిల్‌ (బాగల్‌కోటె)
 • గీతా శివరాజ్‌ కుమార్‌ (శివమొగ్గ)
 • అంజలి నింబాళ్కర్‌ (ఉత్తర కన్నడ)
 • ప్రభా మల్లికార్జున్‌ (దావణగెరె)
 • ప్రియాంకా జార్ఖిహొళి (చిక్కోడి)
 • సౌమ్యా రెడ్డి (బెంగళూరు దక్షిణ)

భాజపా అభ్యర్థులు

 • శోభా కరంద్లాజె (బెంగళూరు ఉత్తర)
 • గాయత్రి సిద్ధేశ్వర (దావణగెరె)

 • బరిలో మొత్తం మహిళలు: 21 మంది
 • జాతీయ పార్టీల తరఫున: 8 మంది
 • స్వతంత్రులు: 13 మంది
 • కాంగ్రెస్‌: ఆరుగురు
 • భాజపా: ఇద్దరు

ఈనాడు, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని